Oct 25,2023 22:43
  • 'ప్రజారక్షణ భేరి' బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి - విజయవాడ : రాష్ట్రానికి అన్ని రకాలుగా ద్రోహం చేస్తూ, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎందుకు అంటకాగుతున్నాయో రాష్ట్ర ప్రజలకు వివరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో తోలుబొమ్మలాట రాజకీయాలు చేయొద్దని, బిజెపి చేతిలో కీలుబొమ్మలుగా మారొద్దని ఆ పార్టీలకు హితవు పలికారు. అసమానతలులేని అభివృద్ధి, ప్రత్యామ్నాయ విధానాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు సిపిఎం ఆధ్వర్యాన నవంబరు 15న విజయవాడలో నిర్వహించే ''ప్రజారక్షణ భేరి'' బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ముందుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, డి.రమాదేవి, సిహెచ్‌.బాబూరావు, బి.తులసీదాస్‌తో కలిసి ఆయన బహిరంగ సభ జరిగే అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియాన్ని పరిశీలించారు. స్టేడియం ప్రాంగణంతోపాటు బిఆర్‌టిఎస్‌ రోడ్డు నుంచి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించే రోడ్డు మ్యాప్‌నూ పరిశీలించారు. అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం పట్ల అధికార వైసిపితోపాటు టిడిపి, జనసేన పార్టీలు మెతకవైఖరి అవలంభిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల హక్కులను మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నాయన్నారు. టిడిపి, జనసేన పార్టీలు ఏ ప్రాతిపదిక ఎన్‌డిఎలో కొనసాగుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తిదారుల జాబితాను బయటపెట్టాలని ఇటీవల బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్‌ చేశారని, ఇదే అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ఫిర్యాదు చేసినా స్పందనలేదన్నారు.

బహిరంగ సభను విజయవంతం చేయండి

నవంబరు 15న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఫుడ్‌ జంక్షన్‌ నుంచి మహాప్రదర్శన ప్రారంభమై సింగ్‌నగర్‌లోని ఎంజి స్టేడియం వరకు సాగుతుందన్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు బస్సు జాతాలు పర్యటిస్తాయని, ఈ నెల 30న కర్నూలు జిల్లా ఆదోని, పార్వతీపురం జిల్లా సీతంపేట నుంచి రెండు జాతాలు, నవంబరు 2న శ్రీకాకుళం జిల్లా మందసం నుంచి మరో జాతా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణారావు, కార్యదర్శివర్గ సభ్యులు కె దుర్గారావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.ప్రసన్న, ఎ.అకోక్‌ తదితరులు పాల్గొన్నారు.