Aug 26,2023 16:55

ప్రజాశక్తి-నందవరం (కర్నూలు) : తిమ్మారెడ్డి కుంటలోని బావి, బోరు నీరుని కలిపి వదలడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడొద్దని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, తాలూకా క్లస్టర్‌ ఇన్‌ ఛార్జ్‌ మాధవ రావు దేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన నందవరంలో తిమ్మా రెడ్డి కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం పోగా, దుర్వాసన వచ్చే తాగునీటిలో సరఫరా చేయడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ప్రభుత్వా నిబంధన ప్రకారం 20 నుండి 30రోజులకు ఒకసారి తాగునీటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని, శుభ్రం చేయకుండా నీటిని సరఫరా చేయడంతో ఆ నీరు దుర్వాసన వస్తున్నాయన్నారు. బావినీటిని, బోర్‌ నీటిని కలిపి వదలడంతో నీటీలో స్వచ్ఛతలో మార్పు వచ్చి తాగునీటికి పనికి రాకుండా పోతున్నాయన్నారు. అలాగే గ్రామంలోని కొన్ని కాలనీలకు బోర్లలోని ఉప్పు నీటిని సరఫరా చేయడంతో గ్రామంలోని ప్రజలు ఆ నీటిని తాగలేక ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గర, సుజాల స్రవంతి పథకం దగ్గర ఒక్కో బిందె రూ.10రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులు స్పందించి స్వచ్ఛమైన తాగినీరు అందించేందుకు కృషి చేయాలని, లేకపోతే సంబంధిత అధికారులు, సర్పంచిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తిమ్మరాజు, తెలుగు ఈరన్న, వెంకటేష్‌, బసవ, మల్లికార్జున, వలి తదితరులు పాల్గొన్నారు.