Sep 29,2023 09:58

న్యూఢిల్లీ : యుక్తవయసులో సెక్స్‌ను నేరంగా పరిగణించడంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో, 22వ లా కమిషన్‌, తన నివేదికలో, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కనీస సమ్మతి వయస్సును 18 నుంచి 16కి తగ్గించడాన్ని వ్యతిరేకించింది.ఈ మేరకు కమిషన్‌ తన నివేదికను బుధవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించింది.''లాకమిషన్‌ నివేదికలో అనేక సిఫార్సులు చేసింది. పోక్సో చట్టం ప్రకారం సమ్మతి కనీస వయసును 18 నుండి 16కి తగ్గించడానికి ప్యానెల్‌ అనుకూలంగా లేదు, ''అని తెలిపింది.పోక్సో చట్టం- 2012 ప్రకారం ఇద్దరు మైనర్‌ల మధ్య సమ్మతి ఉన్నప్పటికీ, 18 ఏళ్లలోపు వారికి అన్ని లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణిస్తుంది. నవంబర్‌ 2012లో లైంగిక సంపర్కానికి కనీస సమ్మతి వయసు 16 నుండి 18 సంవత్సరాలకు పెంచబడింది. పోక్సో చట్టం కింద కేసుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ 2012 చట్టం ప్రకారం సమ్మతి వయస్సును సమీక్షించాలని కోరారు.