Mar 15,2023 13:35

ప్రజాశక్తి - కలక్టరేట్‌ (కృష్ణా) : జిల్లా కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా బుధవారం స్థానిక పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల, హిందూ కళాశాలల్లో ఇంటర్‌ పరీక్షా కేంద్రాలు సందర్శించి పరీక్షా నిర్వహణ విధానం పరిశీలించారు. తొలుత పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల సందర్శించిన కలెక్టర్‌ పరీక్షా కేంద్రంలోని రూములు పరిశీలించి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలో కల్పించిన ఫర్నిచర్‌, త్రాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న రూముల్లో వెంటిలేషన్‌ సరిగా లేదని అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా సరైన వెలుతురు ఉండేలని అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షా కేంద్రంలో 301 మంది అభ్యర్థులను కేటాయించగా ఈ రోజు మొదటి సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు 298 మంది హాజరయ్యారని, ముగ్గురు గైర్హాజరయ్యారని, పరీక్షా కేంద్రం అధికారులు కలెక్టరుకు నివేదించారు. అనంతరం హిందూ కళాశాల కేంద్రంలో రూములు పరిశీలించిన కలెక్టర్‌ ప్రతి రూముకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రూములు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం గమనించి పరిశుభ్రంగా ఉంచాలని కళాశాల ప్రిన్సిపాల్‌ని ఆదేశించారు. అభ్యర్థుల హాల్‌ టికెట్ల నెంబర్లతో కేటాయించిన రూముల సమాచారం బోర్డు ఏర్పాటు చేయకపోవడం పట్ల పరీక్ష నిర్వహణ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అభ్యర్ధులకు కేటాయించిన రూముల నెంబర్లతో బోర్డు వెంటనే ఏర్పాటు చేయలన్నారు. ఈ కేంద్రానికి ఈ రోజు మొదటి సంవత్సరం పరీక్షకు 393 మంది అభ్యర్ధులకుగాను 384 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ రోజు ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయన్నారు. కష్ణాజిల్లా పరిధిలో 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం అభ్యర్థులు 37,477 మంది కాగా వీరిలో మొదటి సంవత్సరం 20,530, రెండవ సంవత్సరం 16,947 మంది అభ్యర్థులు ఉన్నారు. 52 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్టుమెంటల్‌ అధికారులను నియమించారన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ క్రింద నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్లను, 5 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యూకేషన్‌ అధికారి బి.ఎస్‌ఆర్‌ వి ప్రసాద్‌ కూడా ఉన్నారు.