ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం) : చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం వలన వ్యాదులు సోకకుండా ఉండవచ్చని డిఆర్డిఏ వైయస్సార్ క్రాంతి పథం ఏపిఎం పి రమేష్ బాబు తెలిపారు. మండలంలోని బోడపాడు గ్రామంతో పాటు, బొడిచర్ల, గొట్టిపాడియ, మాల్యవంతునిపాడు, దరిమడుగు, వేములకోట, గ్రామాలలో ఆదివారం ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో చేతుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందు చేతులను సబ్బుతో పరిశుభ్రం చేసుకున్న తర్వాతనే భోజనం, వంట కార్యక్రమాలను చేయాలని కోరారు. మహిళలు మీ ఇళ్లలోని కుటుంబ సభ్యులకు చేతుల పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేసి అవగాహన పెంచాలని కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సమీపంలోని వృద్ధులకు, చిన్నారులకు, మహిళలకు, యువకులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించి ప్రతి పని చేసే ముందు తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో వాష్ చేసుకోవాలని తెలియజేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాలతో కలిసి బ్యానర్‌తో అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడపాడు విఒఎజి సుబ్బలక్ష్మి, గ్రామ సంఘాల వివోఏలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, లీడర్లు పాల్గొన్నారు.










