- వారి జనాభా సమాచారాన్ని 'నీతి ఆయోగ్'లో చేర్చాలి
- వారిలో బహుమితీయ పేదరికం అధికం
- పలు అంశాల్లో వెనకబడి ఉన్న వైనం
- నిపుణులు, విశ్లేషకుల సూచన
న్యూఢిల్లీ : భారత్‌లోని వికలాంగులపై వివక్ష కొనసాగుతున్నదనీ, వారు ఇతర పేదవారి కంటే అధికంగా అనేక రంగాల్లో వెనకబడి ఉన్నారని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. భారతదేశ పేదరికాన్ని 24.9 శాతం నుంచి 15 శాతానికి తగ్గించినట్టు నిటి ఆయోగ్ ఇటీవల తన నివేదికలో పేర్కొన్నది. ఇది ద్రవ్యపరమైన అంశాలకు అతీతంగా పేదరికాన్ని అర్థం చేసుకునేందుకు సానుకూల దశను సూచిస్తుందని నిపుణులు తెలిపారు. అయితే, వికలాంగుల విషయం పైనా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిటి ఆయోగ్ నివేదికలో వికలాంగుల జనాభాకు సంబంధించిన సమాచారాన్ని చేర్చాలను సూచిస్తున్నారు. వైకల్యం లేనివారితో పోలిస్తే వికలాంగ సభ్యులు ఉన్న కుటుంబాలు బహుమితీయ పేదరికాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయని అనేక అధ్యయనాల సమాచారాన్ని, నివేదికలను వారు గుర్తు చేస్తున్నారు. వైకల్యాన్ని నిర్వచించటమంటే పేదరికాన్ని నిర్వచించినంత సవాలుగా ఉంటుందనీ, వికలాంగులు పేదరికానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని విశ్లేషకులు, నిపుణులు నమ్ముతున్నారు. అయితే, పేదరికాన్ని కొలిచే విధానం తరచుగా వారి ప్రత్యేక సవాళ్లు, అవసరాలను విస్మరిస్తుందనీ, పేదరిక సూచీలో వీరి అంశాలు కనబడకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశ జాతీయ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు అనే మూడు సమానమైన పరిమాణాలను కలిగి ఉంటుంది. వీటిని మొత్తం 12 సూచికలు సూచిస్తాయి. భారతదేశంలో పేదరికాన్ని చర్చించడానికి బహుమితీయ సూచికను ఉపయోగించడం ఒక విధానం. అయితే, నివేదిక పరిమిత ఆరోగ్య సూచికలు, పోషకాహారం, పిల్లలు, కౌమార మరణాలు, ప్రసూతి ఆరోగ్యం వంటివి పేదరికంపై వైకల్యం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకపోవటం ఆందోళనకరమని నిపుణులు అంటున్నారు.
వికలాంగ వ్యక్తి కుటుంబం వారి జీవితకాలంలో పునరావృతమయ్యే వైద్య వ్యయాన్ని ఎదుర్కొంటుంది. మొత్తం 12 సూచికలను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, వైకల్యం అనే పదం మొత్తం నివేదికలో ప్రసూతి ఆరోగ్యం, పుట్టుకతో వచ్చే వైకల్యాలకు సంబంధించిన నివారణ సందర్భంలో మాత్రమే ఉపయోగించబడింది. వైకల్యం, ఆరోగ్య ఖర్చుల దీర్ఘకాలిక, పునరావృత ప్రభావం, ఇతర అంశాలను విస్మరించటం అనేది ఎంపీఐలోని అన్ని ఇతర సూచికలను ప్రభావితం చేస్తుందని నిపుణులు తెలిపారు.
ఉదాహరణకు, విద్యా కోణంలో చూస్తే.. వైకల్యం ఉన్న వ్యక్తికి అందుబాటులో ఉన్న పాఠశాలలు లేకపోవడంతో పాఠశాల హాజరు తక్కువగా ఉండవచ్చు లేదా పాఠశాల హాజరు ఉండకపోవచ్చు. ఇది 'పాఠశాల హాజరు' సూచికను ప్రభావితం చేస్తుంది. మరోవైపు, ఆటిజంతో బాధపడుతున్న పిల్లవాడు ప్రతిరోజూ పాఠశాలకు హాజరు కావచ్చు కానీ 'పాఠశాల సంవత్సరాల' సూచికలో 'కోల్పోయిన' అని వర్గీకరించబడదు. కానీ పిల్లవాడు అవసరమైన స్థాయి విద్యను విజయవంతంగా సాధించాడని దీని అర్థం కాదు అని నిపుణులు విశ్లేషకులు తెలిపారు.''పేదరికంపై వైకల్యం ప్రభావం అటువంటి సందర్భాలలో కనిపించదు. స్థిరమైన జీవనోపాధి సూచికను చేర్చడం వికలాంగ సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తుంది'' అని నిపుణులు చెప్పారు.










