ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్రమంత్రిమండలి నిర్ణయాలు నిరుద్యోగులను నిరాశపరిచాయని సిపిఎం రాష్ట్రకమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెగా డిఎస్సి ప్రకటిస్తామని ఊరించిన రాష్ట్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయం చేయకపోవడంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 18వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 40వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ఏడాది 12వేల మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేయబోతున్నారని తెలిపారు. అయినప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టులను నింపుతామని, మెగా డిఎస్సి ప్రకటిస్తామని, గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్సి ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నింపి యువతకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు.










