Sep 11,2023 11:04

 జి20లో తీర్మానం
న్యూఢిల్లీ :
మహిళా సాధికారతకు పెద్ద పీట వేయాలని జి20 సదస్సు నిర్ణయించింది. వేతన వ్యత్యాసాలు, లైంగిక హింస, ఉద్యోగావకాశాలు, ఆహార భద్రత వంటి విషయాలలో చొరవ తీసుకోవాలని, ముఖ్యంగా డిజిటల్‌ కార్యకలాపాలలో మహిళలు అధిక సంఖ్యలో భాగస్వాములయ్యేలా చూడాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సదస్సు చివరి రోజైన ఆదివారం నాడు జి20 దేశాధినేతలు డిక్లరేషన్‌ను ఆమోదించారు. జి20 దేశాలలోని మహిళా మంత్రిత్వ శాఖలకు బాసటగా నిలిచేందుకు మహిళా సాధికారతపై కొత్తగా కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని డిక్లరేషన్‌లో తీర్మానించారు. బ్రెజిల్‌లో జరిగే తదుపరి జి20 దేశాల సదస్సులో ఈ కార్యాచరణ బృందం తొలి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం డిజిటల్‌ కార్యకలాపాలను మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తొలగించి, మహిళలు కూడా ఆ కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సదస్సు నిర్ణయించింది.

2030 నాటికి డిజిటల్‌ కార్యకలాపాలలో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసాలను సాధ్యమైనంత వరకూ తగ్గించాలని సదస్సులో తీర్మానించారు. డిజిటల్‌ అక్షరాస్యత, నైపుణ్యాలను పెంచడం సహా జాతీయ డిజిటల్‌ వ్యూహాల రూపకల్పన, అమలులో మహిళలు, బాలికలు మరింత క్రియాశీలకంగా పాల్గొనేందుకు అవసరమైన విధానాలను రూపొందించాలని ప్రతిపాదించారు. డిజిటలీకరణ ప్రక్రియలో భద్రతాపరంగా మహిళలు, బాలికలకు ఎదురయ్యే ముప్పును సదస్సు గుర్తించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల ద్వారా మహిళలను కించపరిచే ప్రయత్నాలు జరగవచ్చునని, డిజిటల్‌ సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానాలలో సురక్షితమైన విధానాలను రూపొందించుకొని వీటిని నివారించవచ్చునని అభిప్రాయపడింది. ముఖ్యంగా మహిళల నేతృత్వంలో, వారి యాజమాన్యంలోని వ్యాపారాలలో వివక్షకు తావులేని డిజిటల్‌ ఎకానమీని ఆచరణలో పెట్టాలని తీర్మానించింది. మహిళలు, బాలికలపై వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టాలు, కాలుష్యం వంటివి చూపే ప్రభావాన్ని జి20 సదస్సు గుర్తించింది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు మహిళల భాగస్వామ్యం, నిర్ణయాలు తీసుకోవడంలో వారి ప్రమేయం, నాయకత్వ లక్షణాలను మరింతగా పెంచాలని నిర్ణయించింది. పర్యావరణానికి సంబంధించిన విషయాలలో నష్టాన్ని తగ్గించే వ్యూహాలను, విధానాలను రూపొందించుకోవాలని జి20 సదస్సు తీర్మానించింది. మహిళా రైతులు చేపట్టే ఆధునిక పద్ధతులను ప్రోత్సహించాలని తీర్మానించింది. మహిళలకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని, వేతనాల చెల్లింపులో పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని జి20 సదస్సు తీర్మానించింది.