Jul 18,2023 15:12

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : పల్నాడు జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రసాద్‌ అనే కాంట్రాక్ట్‌ ఎంఎల్‌హెచ్‌పి ఉద్యోగి రెగ్యులర్‌ ఏఎన్‌ఎమ్‌లని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలువురు ఏఎన్‌ఎమ్‌లు మంగళవారం కలక్టరేట్‌ ధర్నా చౌక్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకూరు శ్రీనివాసరావు, మహిళా విభాగం నాయకురాలు కొమ్ము అనిత, ఏఎన్‌ఎం సంఘ నాయకురాళ్లు మేడూరి సలోమీ, కేశన ఇందిరాలు మాట్లాడుతూ.. తాజాగా ప్రభుత్వం ఎంఎల్‌హెచ్‌పిలని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌గా పెరుమార్చడంతో ఇక కాంట్రాక్టు పద్దతిలో పనిచేసే సదరు ఆ ఎమ్‌ఎల్‌హెచ్‌పిలు మాపై తమ అజమాయిషీ ప్రదర్శించేందుకు తెగబడుతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే పల్నాడు జిల్లాకి చెందిన ప్రసాద్‌ అనే ఎంఎల్‌హెచ్‌పి నోటికోచ్చినట్లు దూషించాడని, ప్రభుత్వం తక్షణమే అతనిపై తగిన చర్యలు చేపట్టి అతన్ని విధుల నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో పెటేటి సుధా రాణి, బండి ఝాన్సీ, బడుగు అరుణ, ప్రసూనంబ, పామర్తి నాగ నాంచారమ్మ, గుంటూరు వనజాక్షి, నిమ్మగడ్డ భాగ్యవతి, డి.సుధ, మార్తా, తూర్పు కృష్ణా ప్రాంతానికి చెందిన వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.