Aug 31,2023 13:08

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై ఆగస్టు సెప్టెంబర్‌ 4న కలెక్టరేట్‌ వద్ద జరిగే సిపిఎం సమరభేరి ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం కర్నూలు జిల్లా కమిటీ సభ్యులు ఎం.రామాంజనేయులు (విజరు) పిలుపునిచ్చారు. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్‌ 4 వరకు సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు రంగస్వామి అధ్యక్షతన జోహారాపురంలో ఆటో స్టాండ్‌ దగ్గర సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎం.రామాంజనేయులు మాట్లాడుతూ.. 2014 సంవత్సరం ఎన్నికల ముందు వంద రోజులలో అన్ని రకాల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన బిజెపి 9 సంవత్సరాల పరిపాలనలో ధరలు తగ్గించకపోగా ధరలను ఆకాశాన్ని తాకేలా చేసిందని విమర్శించారు. సామాన్యుడు కొని తినలేని స్థాయిలో ధరలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అధికారం చేపట్టకముందు 400 రూపాయలు ఉన్న గ్యాస్‌ ధర అధికారంలోకి వచ్చాక 1150 రూపాయలకు చేరుకుందన్నారు. కరోనాకాలంలో ప్రపంచమంతా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గిపోగా మనదేశంలో మాత్రం బిజెపి ప్రభుత్వం అదాని, అంబానీ ఆస్తులు పెంచడానికి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు విపరీతంగా పెంచిందని వారు విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన బిజెపి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడదీస్తూ ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా అమ్ముతూ కార్మిక కుటుంబాలను రోడ్డున వేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హౌదా, రైల్వే జోన్‌, వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు నిధులు గత టిడిపి ప్రభుత్వం వారు సాధించలేకపోయారన్నారు. మన ప్రభుత్వం వస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విభజన హామీలను అమలు చేయిస్తానని లేదా పోరాడి సాధిస్తానని నమ్మబలికిన వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టాక వాటిని సాధించలేకపోగా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆయుపట్టైన ఇసుకను బంద్‌ చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చెత్త పన్ను వసూలు చేయడం దుర్మార్గమన్నారు, విద్యుత్‌ ను ప్రైవేటీకరిస్తూ సంస్కరణ చట్టాలు 2020 లో బిజెపి ప్రభుత్వం తెస్తే మొదట మన రాష్ట్రంలో అమలు చేసి గడచిన కాలానికి ట్రూ ఆఫ్‌ చార్జీల పేరుతో అదనపు చార్జీలు, పెంచిన విద్యుత్‌ చార్జీలు కలిపి వైసిపి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అభివద్ధి చెందుతున్నారు అని చెబుతూ వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిస్తూ రాష్ట్రాన్ని ఆదానీలకు అంబానీలకు అమ్ముతున్నారని విమర్శించారు, కాబట్టి పెరిగే ధరలను అదుపు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు తగ్గించి 400 రూపాయలకే గ్యాస్‌ ఇవ్వాలని, పట్టణాలలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్‌ లతో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్‌ 4 వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే సమరభేరి ఉద్యమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమం ముగింపుగా సెప్టెంబర్‌ 4న కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ నాయకులు మైముద్‌, దాసు, తిప్పన్న, నాగరాజు, కుమార్‌, సంసోన్‌, మాసుం, భరత్‌, మోహన్‌, మధు, కృష్ణ, మౌలాలి, జోసెఫ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.