Oct 20,2023 08:27

- గతంలో కంటే తక్కువ అప్పులు
-ఎమ్మిగనూరు జగనన్నచేదోడు సభలో సిఎం జగన్‌
- రూ.3.25 లక్షల మంది ఖాతాల్లో రూ.325 కోట్లు జమ
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి:రాబోయేది కురుక్షేత్ర సంగ్రామమని, వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాము గతంలో ఎప్పుడూ చేయని విధంగా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ రూ.2.38 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. జగనన్న చేదోడు నాలుగో విడత జమ కార్యక్రమాన్ని గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించారు. 3.25 లక్షల మంది ఖాతాల్లో రూ.325 కోట్లు జగనన్న చేదోడు మొత్తాన్ని బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ... ఏ పార్టీకి ఓటేశారో అడగకుండా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అదే బడ్జెట్‌ అదే రాష్ట్రమని, మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని చెప్పారు. అప్పుల పెరుగుదల కూడా గతం కంటే తక్కువేనన్నారు. గతానికి ఇప్పటికీ తేడా ఏంటో ఆలోచన చేయాలన్నారు. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు బటన్‌ నొక్కితే డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని వివరించారు. వైద్యం అవసరమైతే తోడుగా ఉండే ప్రభుత్వం, ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ తమ దగ్గరకే వచ్చే ప్రభుత్వం, ఇల్లు కట్టించే తపన ఉన్న ప్రభుత్వం కావాలని, ప్రతి పేద కుటుంబం కోరుకుంటుందని తెలిపారు. చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలోని ప్రజలకు కూడా చంద్రబాబు మావాడు అని చెప్పుకునే పరిస్థితి లేని పాలన కనిపిస్తుందన్నారు. ఎన్నికలప్పుడు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణమాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వినిపించేదనీ, బాబు సిఎం అయిన తర్వాత రుణమాఫీ కథ పక్కన పెడితే సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారని విమర్శించారు. గతంలో మేనిఫెస్టోను ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో వేశారని, 10 శాతం హామీలను కూడా అమలు చేయలేదని తెలిపారు. తాము మేనిఫెస్టోలోని 99 శాతం వాగ్దానాలను అమలు చేశామన్నారు. జన్మభూమి కమిటీలు, రాజధాని భూములు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌ గ్రిడ్‌, చివరికి మద్యం కొనుగోళ్లలో కూడా దోచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు లంచాలు అడిగేవారు, వివక్ష చూపే వారు లేరని తెలిపారు. పొదుపు సంఘాలను మోసం చేస్తూ సున్నా వడ్డీ పూర్తిగా ఎత్తేసారని, మీ బిడ్డ సిఎంగా వచ్చి పొదుపు సంఘాలకు తోడుగా ఉన్నారని చెప్పారు. స్వతంత్రం వచ్చాక నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే తాము 2.07 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. గతంలో పెన్షన్‌, రేషన్‌ కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరుగుతూ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు, ఎరువుల కోసం రైతులు చనిపోయే పరిస్థితి ఉండేదని, ఈ రోజు అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు, రైతులకు తోడుగా వలంటీర్లు ఉంటున్నారన్నారు. ఓటు వేసేటప్పుడు ఇంట్లో మంచి జరిగిందా లేదా కొలమానంగా తీసుకోవాలని, తాను నమ్ముకున్నది ప్రజలనేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపి సంజీవ్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సిఎం పర్యటన నేపథ్యంలో పలువురి అరెస్ట్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆదోనిలో టిడిపి నాయకులు గుడిసె ఆది కృష్ణమ్మను ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సిఎం పర్యటన ముగిసిన తరువాత అరెస్ట్‌ చేసిన నాయకులను వదిలేశారు.