న్యూఢిల్లీ : అత్యవసర, ప్రాణాలను రక్షించే ఔషధాల ధరల నియంత్రణకు అనుసరించే విధానాన్ని సుప్రీంకోర్టులో సమర్పించేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు తాజా అఫిడవిట్‌ను దాఖలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ తరపున సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వేస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను అక్టోబర్ 4కు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ఔషధ ధరల నియంత్రణ విధానం 2013ను సవరిస్తూ గత ఏడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యవసర, ప్రాణాలను రక్షించే ఔషధాల ధరలను సవరించింది. కొన్ని అత్యవసర ఔషధాల ధరల నియంత్రణను ప్రభుత్వ నియంత్రణ సంస్థ అయిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నుంచి కేంద్రం తప్పించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొన్ని నెలలుగా సుప్రీంకోర్టు ఈ పిటీషన్‌ను విచారిస్తుంది.










