Nov 02,2023 21:45

- కల్లూరు బాధితులకు పరామర్శ
ప్రజాశక్తి-గార్లదిన్నె, అనంతపురం:నిరుపేద దళితులు, సంచార గిరిజనులు నాలుగేళ్లుగా గుడిసెలేసుకుని జీవనం సాగిస్తుంటే.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉన్నఫలంగా వచ్చి ఇళ్లు కూల్చివేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో అధికారులు కూల్చివేసిన ఇళ్లు, గుడిసెలను మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం.బాషా, సిఐటియు నాయకులు ఎజి.రాజమోహన్‌తో కలిసి ఆయన గురువారం సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 'నిలువ నీడలేని వాళ్లం.. రోజు కూలిపనులకెళ్లి జీవనం సాగించేవాళ్ల.. తమకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో కల్లూరులో శివారులో 132 కుటుంబాల వాళ్లం గుడిసెలేసుకుని జీవనం సాగిస్తున్నాం.' అని తెలిపారు. ఇది దేవుడి మాన్యం అంటూ అధికారులు నాలుగు జెసిబిలతో వచ్చి దౌర్జన్యంగా తమ ఇళ్లను కూల్చివేశారని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు మద్దతుగా వచ్చిన సిపిఎం నాయకుల పట్ల సిఐ నరేంద్రరెడ్డి దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులు ఉన్నారని వేడుకున్నా వినకుండా ఇళ్లు కూల్చారని వాపోచారు. ఈ సందర్భంగా గేయానంద్‌ మాట్లాడుతూ.. నిలువ నీడలేని నిరుపేదలు చిన్నపాటి గుడిసెలు వేసుకుంటే పోలీసులు, రెవెన్యూ అధికారులు రౌడీల్లాగా వ్యవహరిస్తూ వాటిని కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోకుండా అధికారులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. ఇప్పటికైనా బాధితుల పట్ల దురుసుగా వ్యవహరించిన సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిఐజి అమ్మిడిరెడ్డిని కలిసి సిపిఎం నాయకుల పట్ల దురుసుగా వ్యవహరించిన సిఐను సస్పెండ్‌ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కలెక్టర్‌ గౌతమిని కలిసి బాధితుల సమస్యను ఆమెకు వివరించారు. ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా అధికారులు ఇళ్లు కూల్చివేశారని తెలిపారు. కల్లూరు బాధిత పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఆర్‌డిఒ ద్వారా విచారణ జరిపిస్తామని,బాధితులకు జగనన్న ఇళ్లు మంజూరు చేస్తామని, నష్టపరిహారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.