Nov 05,2023 08:11

- నిరాశ్రయులైన 33 కుటుంబాలు
ప్రజాశక్తి-పోరుమామిళ్ల (కడప జిల్లా):కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని గుంటూరు బాపనయ్య కాలనీలోని పేదల ఇళ్లను రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం అక్రమంగా కూల్చివేశారు. ఇళ్లు కూల్చవద్దని, తమను నిరాశ్రయులను చేయవద్దని అధికారులను మహిళలు, వృద్ధులు వేడుకున్నా కనికరం చూపలేదు. అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు బాపనయ్య కాలనీలో సుమారు 20 సంవత్సరాల నుంచి దళితులు, గిరిజనులకు చెందిన 33 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. వీరందరూ రోజువారి కార్మికులు. తమకు పట్టాలు మంజూరు చేయాలని గతంలో సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. తహశీల్దార్‌కు అనేకమార్లు వినతిపత్రాలూ అందజేశారు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. కార్మికులందరూ పనికి వెళ్లిన సమయంలో ఉన్నపళంగా పేదల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న సిపిఎం మండల కార్యదర్శి భైరవప్రసాద్‌ సంఘటనాస్థలికి చేరుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని, తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇళ్లను కూల్చివేశామని తహశీల్దార్‌ గంగయ్య తెలిపారు.