Nov 01,2023 21:50

- అడ్డుకోబోయిన నేతలపై లాఠీఛార్జీ
- రాంభూపాల్‌పై చేయిచేసుకున్న సిఐ
- తీవ్రంగా ఖండించిన సిపిఎం
ప్రజాశక్తి -అనంతపురం ప్రతినిధి:నిరుపేదలందరికీ ఊర్లను, కాలనీలను నిర్మిస్తున్నామంటూ నిత్యం గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం అదే నిరుపేదలపై దౌర్జన్యకాండకు పాల్పడింది. కాయాకష్టం చేసి తలదాచుకోవడానికి కాస్తంత చోటులో నాలుగేళ్ల కిందట నిర్మించుకున్న ఇళ్లను, గుడెసలను అమానవీయంగా పెకిలించివేసింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ పరిధిలో బుధవారం తెల్లవారుఝామున చోటుచేసుకున్న ఈ దురాగతం కారణంగా గిరిజన, దళిత సామాజిక తరగతులకు చెందిన 150 నిరుపేద కుటుంబాలు వీధినపడ్డాయి. ఈ స్థలాల్లో పేదల ఇళ్లను తొలగించరాదని హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసి.. కూల్చివేతలను అడ్డుకోబోయిన పేదలపైనా, సిపిఎం నాయకులపైనా పోలీసులు దాడికి పాల్పడ్డారు. విచక్షణారాహిత్యంగా లాఠీఛార్జీ చేయడంతో పాటు సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌పై ఇటుకలపల్లి సిఐ వై నరేంద్రరెడ్డి చేయిచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ వేడుకుల చేసుకుంటున్న రోజే నిరుపేద దళిత, గిరిజనులపై పోలీసులు సాగించిన ఈ దౌర్జన్యకాండపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ దాష్టీక చర్యను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన సిఐపైనా, ఇతర అధికారులపైనా తక్షణమే చర్యలు తీసుకోవాలని, పేదలందరికీ కూల్చివేసినచోటే ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.