- లబ్ధిదారులకు వెంటనే అప్పగించి బ్యాంకు రుణాలు రద్దు చేయాలి
-గత ప్రభుత్వంపై కక్ష జనంపై తీర్చుకోవడం దారుణం : వి.శ్రీనివాసరావు
-పోణంగిలో టిడ్కో ఇళ్ల పరిశీలన
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి:గత ప్రభుత్వంపై కక్షను లబ్ధిదారులపై చూపిస్తూ పూర్తయిన టిడ్కో ఇళ్లను వారికి ఇవ్వకపోవడం నేరపూరిత చర్యని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. వెంటనే వాటిని లబ్ధిదారులకు అందించాలని, ఇళ్ల కోసం లబ్ధిదారులు తీసుకున్న బ్యాంకు రుణాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజారక్షణ భేరి యాత్రలో భాగంగా ఏలూరు విచ్చేసిన సిపిఎం బృందం పోణంగిలో నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించింది. కట్టిన ఇళ్లన్నీ పాడుబడి అడవి మాదిరిగా తుప్పులు కమ్ముకోవడం చూసి నాయకులు నిర్ఘాంతపోయారు. ఇనుప ఊచలన్నీ తుప్పు పట్టిపోవడం, ఇళ్లు కట్టి ఏళ్లు గడిచిపోవడంతో పెచ్చులు ఊడిపోవడం వంటివి ఈ బృందం దృష్టికి వచ్చాయి. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లు క్రితం పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు నేటికీ ఇవ్వకుండా రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడం దారుణమన్నారు. పేద కుటుంబాలు డబ్బు కట్టి టిడ్కో ఇళ్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. టిడ్కో ఇళ్లు మూడు కేటగిరీలుగా ఉన్నాయని, వీటిలో రూ.500 చెల్లించినవి, రూ.50 వేలు చెల్లించినవి, రూ.లక్ష చెల్లించినవి ఉన్నాయని వివరించారు. రెండు కేటగిరీల లబ్ధిదారులు బ్యాంకు రుణాలు సైతం తీసుకున్నారని తెలిపారు. ఇళ్లు లబ్ధిదారులకు అందకపోయినా రుణాలు వడ్డీతో కట్టాలని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వంపై కక్షతో లబ్ధిదారులను శిక్షించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఒక్క ఏలూరులోనే టిడ్కో ఇళ్ల కోసం లబ్దిదారుల నుంచి రూ.22 కోట్లు వసూలు చేశారని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు వరకూ ఉన్నాయన చెప్పారు. మొత్తం 18 వేల మంది లబ్ధిదారులు ఉండగా, 12 వేల మందిని జగనన్న ఇళ్ల కాలనీల్లోకి పంపించేశారన్నారు. మిగిలిన లబ్ధిదారులకైనా టిడ్కో ఇళ్లను నేటికీ ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో 2.60 లక్షల టిడ్కో ఇళ్లను నిర్మించారని, అందులో లక్షా 40 వేలు ఇళ్లు రూ.500 చెల్లించినవి కాగా, మరో లక్షా 20 వేల ఇళ్లు బ్యాంకు రుణాలు తీసుకున్నవని వివరించారు. కట్టిన ఇళ్లను పాడుబెట్టడంతో ద్వారబంధాలు పడిపోయాయని, నాణ్యత దెబ్బతిందని, అడవిలో మాదిరిగా పిచ్చి మొక్కలు మొలిచాయని తెలిపారు. గత ప్రభుత్వానికి పేరు రావడం ఇష్టం లేకపోతే జగనన్న అంటూ పేరు పెట్టుకుని లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని సూచించారు. కృష్ణా జిల్లాలో ఐదు వేల టిడ్కో ఇళ్లలో గృహప్రవేశం చేసినట్లు ప్రభుత్వం చెప్పిందన్నారు. అయితే, ఇప్పటికీ కొన్ని టిడ్కో ఇళ్లను పూర్తి చేయకపోవడంతో రూ.వేల కోట్లు వృథా అవుతున్నాయని చెప్పారు. ఏలూరులో ఆరు వేల ఇళ్లు కట్టి పాడుబెట్టారని తెలిపారు. టిడ్కో ఇళ్లకు తీసుకున్న బ్యాంకు రుణాలను రద్దు చేయాలని, ఇప్పటి వరకూ బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వమే కట్టాలని డిమాండ్ చేశారు. రుణాలను రద్దు చేస్తే లబ్ధిదారులే ఇళ్లను పూర్తి చేసుకుని స్వాధీనం చేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, కె.సురేంద్ర, రాష్ట్ర నాయకులు సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఎ.రవి, నగర కార్యదర్శి.పి.కిషోర్, సీనియర్ నాయకులు బి.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.










