Feb 18,2023 12:35

ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్‌ : వైసిపి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం రోజు రోజుకు దిగజారిపోతుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు భూపేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూపేష్‌ రెడ్డి మాట్లాడుతూ ... శుక్రవారం అనపర్తిలో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అన్నారు. 14 నెలల్లో ఇంటికి వెళ్లే రోజులు ముఖ్యమంత్రి కి దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన కింద పోలీసులు పనిచేయాల్సి వస్తుందన్నారు. పోలీసులు ఈ స్టేషన్‌ కాకుంటే మరో స్టేషన్‌ కు వెళతారు అంతే కానీ ఎవరికి భయపడకూదని చెప్పారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా పాలన సాగించాలనుకోవడం ఏ ప్రభుత్వానికైనా సరైనది కాదన్నారు. అధికార పక్షానికి ప్రతిపక్షము, ప్రతిపక్షానికి అధికార పక్షము రెండు ఉంటేనే ప్రజాస్వామ్యము అభివృద్ధి చెందుతుందన్నారు. నిరంకుశ పాలనకు నిదర్శనం ఈ వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. పోలీసులు కూడా చూసుకొని ఆంక్షలు విధించాలన్నారు. ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అధికారులు, ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, ఎస్టి నాయకులు హనుమంతు నాయక్‌, కిరణ్‌ రాయల్‌, వెల్డింగ్‌ గైబు, సర్దార్‌, పొన్నతోట బ్రదర్స్‌ శ్రీను, మల్లి, తులసిరెడ్డి, నెల్సన్‌, రఫీ, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.