Oct 22,2023 15:33

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై నవంబర్‌ 8న వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం ఆదోనిలోని ఎన్‌జీఓస్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయా రాష్ట్రాలలో తమకు అనుకూలంగా వ్యతిరేకంగా ద్వంద వైఖరి అవలంబిస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీ కరణ చేస్తాం పార్లమెంట్‌ సాక్షిగా చెప్పుతూ వచ్చేనెల ఎన్నికల జరుగుతున్న ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కృషి చేస్తామని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన పట్ల తమ వైఖరి ఏమిటో అర్థం అవుతుందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. విద్యార్థి యువజుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మికులు అనేక ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. నవంబర్‌ 8 నాటికి కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు 1000 రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలు పాల్గొనడంతో పాటు ఆరోజు విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తామన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, పార్లమెంట్‌ నిర్మాణానికి కూడా ఉక్కునందించిన వంటివి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీతోనే యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాల అభివృద్ధి కావాలంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, దీని ద్వారానే రాయలసీమ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కషి చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌ అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆదోనిలో కడపలో ఫ్యాక్టరీ సాధన మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, మేధావులతో ఆదోని పట్టణంలో ఈనెల 26న రౌండ్‌ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి:యస్‌. షాబీర్‌ భాష, ఎఐఎస్‌ ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి:యస్‌. షాబీర్‌ భాష, పీడీఎస్‌యు ఉమ్మడి జిల్లా కార్యదర్శి నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, పీడీఎస్‌ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్‌, పీడీఎస్‌యు జిల్లా అధ్యక్షులు అఖండ, బిడీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వినర్‌ రమేష్‌, ఏఐవైఎఫ్‌ మండల కార్యదర్శి అంజిత్‌ గౌడ్‌, ఏఐడిఎస్‌ఓ నాయకులు శివరాజ్‌, ఏఐఎస్‌ ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, నాయకులు, కార్తీక్‌, గోవర్ధన్‌, శివ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దినేష్‌, గౌస్‌, శశి, పీడీఎస్‌యు నాయకులు నరేష్‌, శివ, లోకేష్‌, బిడీఎస్‌ఎఫ్‌ నాయకులు సాయి, శీను, గిరిష్‌, పీడీఎస్‌ఓ నాయకులు అశోక్‌ పాల్గొన్నారు.