- మూడు రోజుల్లో 31 మంది రోగుల మృతి
- వారిలో 16 మంది చిన్నారులే
నాందేడ్ : మహారాష్ట్రలోని నాందేడ్‌లో గత నెల 30వ తేదీ నుండి మూడు రోజుల వ్యవధిలో 31 మంది రోగులు చనిపోయారు. వీరిలో 16 మంది చిన్నారులే. మందుల కొరత, సకాలంలో వైద్య సాయం అందకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. గత నెల 30 నుంచి ఈ నెల 1వ తేదీ వరకూ 12 మంది పెద్దలు, 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా సోమవారం రాత్రి ముగ్గురు పెద్దలు, నలుగురు చిన్నారులు చనిపోయారు. రోజుకు సగటున 10 నుండి 14 మంది పిల్లలు చనిపోయారని ఆస్పత్రి రికార్డులను బట్టి తెలుస్తోంది. చనిపోయిన పెద్ద వారిలో గుండె జబ్బులతో బాధపడుతున్న వారు, కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఉన్నారని శంకర్‌రావ్ చౌహాన్ ప్రభుత్వ ఆస్పత్రి డీన్ ఎస్‌ఆర్. వాకోడ్ తెలిపారు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది 70-80 సంవత్సరాల మధ్యవయస్కులని చెప్పారు. కన్నుమూసిన చిన్నారులలో నలుగురు నెలలు నిండకముందే జన్మించారని వివరించారు.
నాండేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి సమీప జిల్లాల నుండే కాకుండా తెలంగాణ నుండి కూడా రోగులు వస్తుంటారు. ఇటీవల కొందరు సిబ్బందిని వేరే ఆస్పత్రులకు బదిలీ చేశారని, దీంతో సిబ్బంది కొరత ఏర్పడిందని, రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించడం కష్టమైందని ఆస్పత్రి డీన్ తెలిపారు. దీనికితోడు ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే సంస్థ వాటిని నిలిపివేసిందని చెప్పారు. స్థానికంగా మందులు కొనుగోలు చేసినప్పటికీ అవి సరిపోలేదని అన్నారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ తెలిపారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నాందేడ్ ఆస్పత్రిని సందర్శించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని చెప్పారు. ఆస్పత్రిలో కేవలం 500 పడకలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం 1,200 మంది రోగులను చేర్చుకున్నారని తెలిపారు. చనిపోయిన రోగుల కుటుంబాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. బిజెపికి పేదల ఆరోగ్యం గురించి పట్టింపే లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఎన్‌సిపి ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. నాండేద్ ఆస్పత్రిలో మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు, అమ్మకం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కూలదోయడంతోనే వారు బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఖల్వాలో థానే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఛత్రపతి శివాజీ మహరాజ్ స్మారక ఆస్పత్రిలో ఆగస్ట్ 18న 24 గంటల వ్యవధిలోనే 18 మంది రోగులు మరణించిన విషయం తెలిసిందే.










