Sep 26,2023 22:05

ముంబయి : ప్రఖ్యాత సినీ నటీమణి వహీదా రెహ్మాన్‌ను భారత అత్యున్నత చలనచిత్ర పురస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ థాకూర్‌ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు. 'ఏరువాక సాగారో రన్నో చిన్నన్న..నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న..' అంటూ 1955లో 'రోజులు మారాయి' తెలుగు చిత్రం ద్వారా బాలనటిగా అరంగేట్రం చేసిన వహీదా రెహమాన్‌ అంచెలంచెలుగా రాణిస్తూ దేశం గర్వించే నటిగా ఎదిగారు. గైడ్‌, ప్యాసా, కాగజ్‌ కే పూల్‌ వంటి అనేక చిత్రరాజాల్లో నటించి మెప్పించి సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్నారు. జాతీయ ఉత్తమ నటితో సహా అనేక చలనచిత్ర పురస్కారాలతో పాటు దేశ 3వ, 4వ అత్యున్నన పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్‌ ఆమె ఇప్పటికే అందుకున్నారు.