Aug 29,2023 16:08
  •  ఘనంగా స్వాగతం పలికిన సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారంకై ఆగస్టు 23 నుంచి 28 వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్‌ యాత్ర మంగళవారం ఆత్మకూరుకు చేరుకుంది. ఈ యాత్రకు ఆత్మకూరు సిపిఎం మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జడ్పీ హైస్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో సిపిఎం మండల కార్యదర్శి శివ శంకర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 23వ తేదీన తాడిపత్రిలో ప్రారంభమైన సైకిల్‌ యాత్ర గుత్తి,గుంతకల్లు,వజ్రకరూరు ఉరవకొండక రాయదుర్గం కళ్యాణ్‌ దుర్గం కనేకల్లు మీదుగా ఆత్మకూరు, అనంతపురంలో ముగుస్తుందన్నారు. అనంతపురంలో 30వ తేదీన ముగింపు సభ ఉంటుందన్నారు.  ప్రధానంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ వెనుకబడిన విద్యార్థుల సంక్షేమ హాస్టల్స్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారమన్నారు. మంచినీరు, నాణ్యమైన భోజనం, టాయిలెట్‌ సదుపాయం లేక విద్యార్థిని విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఐదు నెలల నుంచి సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన కాస్కాస్మోటిక్‌ చార్జీలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. హాస్టల్స్‌లో వర్షాకాలంలో నీరు గదుల్లోకి వస్తుందన్నారు. విద్యార్థుల సౌకర్యాలు లేక విద్యను కొనసాగించాల్సిన పరిస్థితి జిల్లాలో ఏర్పడిందన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైన ఇప్పటిదాకా కనీసం చదువుకోవడానికి పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వలేమని విద్యాశాఖ మంత్రి పత్రిక ప్రకటన చేయడం దౌర్భాగ్యం అన్నారు. జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పున ప్రారంభించాలని, కేజీబీవీ, గురుకుల పాఠశాలలో విద్యార్థినిల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు రాజేశ్వరమ్మ, అవాజ్‌ మండల్‌ నాయకులు వలి, విద్యార్థి సంఘం నాయకులు రజిత, సునీత ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివ, వైటిసి రమేష్‌, తరిమేల గిరి, శివ, భీమేష్‌ అంగన్వాడి కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.