
- టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరు
ప్రజాశక్తి - ఆలమూరు : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మండలంలో పలు దేవాలయాల అభివృద్ధికి రూ. కోటి 40 లక్షల మంజూరయ్యాయి. మొత్తం 14 గ్రామ పంచాయతీల పరిధిలో గల ఆలయాలకు ఒక్కొక్క ఆలయానికి రూ.10 లక్షలు చొప్పున ఈ నిధులు మంజూరయ్యాయి. వీటిల్లో అధికంగా తొమ్మిది రామాలయాలు ఉన్నాయి. చెముడులంక, నవాబుపేట, నర్సిపూడి, మూలస్థాన అగ్రహారం, సందిపూడి, పెనికేరు, కలవచర్ల, బడుగువానిలంక, చింతలూరు గ్రామాల్లోని రామాలయాలకు నిధులు మంజూరు కాగా చొప్పెల్ల గ్రామదేవత కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి, పెదపళ్ల సీతమ్మ తల్లి ఆలయానికి, సూర్యారావుపేట ఆంజనేయస్వామి ఆలయానికి, ఆలమూరు కుంతీదేవి ఆలయానికి, మడికి నూకాలమ్మ ఆలయ అభివద్ధికి ఈ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కషితో మునుపెన్నడూ లేనివిధంగా దేవాలయాలకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయని చెప్పవచ్చు. చేపట్టాల్సిన ఈ అభివద్ధి పనులు పరిశీలించడానికి ఆదివారం దేవదాయ శాఖ అసిస్టెంట్ ఇంజనీరు సురేష్ ఈ గ్రామాల్లో పర్యటించారు. అందులో భాగంగా చెముడులంకలో ఆ గ్రామ సర్పంచ్, మండల వైకాపా అధ్యక్షులు తమ్మన శ్రీనివాస్ తో కలిసి ఆ గ్రామ రామాలయ అభివద్ధి పనులు ఏ విధంగా చేపట్టాలనే దానిపై పరిశీలించారు.