- వరద బాధితులకు అందని ప్రభుత్వ సాయం
ప్రజాశక్తి- యలమంచిలి (ఏలూరు జిల్లా) : వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సాయమూ అందక ఆయా లంక గ్రామాలల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మండలంలోని కనకాయలంక, పెదలంక, బాడవ, యలమంచిలి లంక, లక్ష్మీపాలెం, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, దొడ్డిపట్ల గ్రామాల వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గతంలో వరదల సమయంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు, తాగునీరు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని బాధితులు వాపోతున్నారు. పునరావాస కేంద్రాలకు వస్తేనే భోజనాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. లంక గ్రామాల ప్రజలు మాత్రం తమ ఇళ్లను, పశువులు, మేకలు, కోళ్లను వదిలి ఎక్కడో దూరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. దీంతో, వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలకు అధికారులు కనీసం తాగునీరు, పాలు వంటి వాటిని కూడా అందించలేదు. పడవల్లో బయటకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకొనే పరిస్థితి లేక పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. గత పది రోజులుగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమను భోజనాలు, తాగునీరు వంటివి అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

పట్టించుకోవడం లేదు
వరదొచ్చి మా పల్లిపాలెం కాలనీ మొత్తం పీకల్లోతు మునిగిపోయినా ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. వరద బాధితుల గోడు ఈ ప్రభుత్వానికి పట్టకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. బాధితులందరికీ తాగునీరు, భోజనాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం మానవత్వం చాటుకోవాలి.
- కర్రి వెంకటేశ్వరరావు, లక్ష్మీపాలెం

పస్తులుంటున్నాం
గ్రామానికి దూరంగా ఎక్కడో కోనసీమ జిల్లాలోని తాటిపాక కల్యాణ మండపం వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. బాధితులందరినీ అక్కడికి రమ్మని చెబుతున్నారు. అక్కడికి వెళ్లడం లేదని కనీసం చిన్న పిల్లలకు పాలు కూడా అందించడం లేదు. దీంతో, చిన్నా, పెద్ద తేడా లేకుండా పస్తులుండాల్సి వస్తోంది.
- ముస్కూడి నరేష్‌బాబు, కనకాయలంక

ఆహారం అందివ్వడం లేదు
గతంలో వరదలు వచ్చిన ప్రతిసారీ పునరావాస కేంద్రాలకు వెళ్లకపోయినా మా కనకాయలంక గ్రామంలో పది వార్డులు ఉంటే ప్రతి వార్డుకీ ఒక బోటును ఏర్పాటు చేసి అల్పాహారం, భోజనాలు అధికారులు అందించేవారు. ఇప్పుడు మాత్రం పస్తులు పెడుతున్నారు.
- పులి శ్రీరామ్మూర్తి, కనకాయలంక










