May 07,2023 08:07

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌ నడుస్తోంది. అందులోనూ వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తోంది. దీంతో వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులూ వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఇష్టపడుతున్నారు. వెండితెరపై ప్రెజెంట్‌ చేయలేని పెద్ద పెద్ద కథలను వెబ్‌ సిరీస్‌లుగా రూపొందిస్తున్నారు. అలా రూపొందిన వెబ్‌ సిరీసే 'వ్యవస్థ'. 'ఓరు' చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్‌ రంగా ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించారు. వినడానికి టైటిట్‌ పొలిటికల్‌ డ్రామాల అనిపించినా.. కథ మాత్రం పక్కా కోర్టు రూమ్‌ డ్రామా. సరైన రీతిలో తెరకెక్కిస్తే కోర్టు రూమ్‌ డ్రామాలు కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతాయని 'వకీల్‌ సాబ్‌', 'నాంది' చిత్రాలు రుజువు చేశాయి. మరి ఈ సిరీస్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకుందా? లేదా? కథేంటి? ఎలా ఉంది? అనేది తెలుసుకుందాం...
కథలోకి వెళ్తే... యామిని (హెబ్బా పటేల్‌), అజరు నూతన దంపతులు. కొత్త పెళ్లికొడుకు శోభనం గదిలోకి వెళ్లగానే తుపాకీ పేలిన శబ్దం రాగా బంధువులు, పనిమనుషులు కంగారుపడి, తలుపులు తెరిచి లోపలికి వెళ్తారు. రక్తపు మడుగులో ఉన్న అజరు మృతదేహాన్ని, యామిని చేతిలో గన్‌ చూసిన వాళ్లంతా షాక్‌ అవుతారు. సమాచారం అందిన పోలీసులు యామినిని అరెస్ట్‌ చేస్తారు. కేసు నుంచి బయటపడేందుకు ప్రముఖ లాయర్‌ అవినాష్‌ చక్రవర్తి (సంపత్‌ రాజ్‌)ను యామిని కుటుంబం సంప్రదిస్తుంది. అయితే, మొదటి వాయిదాలో న్యాయవాదిని మార్చుకోవాలని అనుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేస్తుంది. కోర్టులో తనకు ఎదురే ఉండకూడదని తోటి మేటి న్యాయవాదులను భాగస్వాములుగా చేసుకుని, చెక్‌మేట్‌ పేరుతో ఫర్మ్‌ ప్రారంభిస్తాడు. అటువంటి చక్రవర్తి దగ్గర జూనియర్‌ లాయర్‌ అయిన వంశీకృష్ణ (కార్తీక్‌ రత్నం) చేతిలో యామిని తన కేసు పెడుతుంది. తనను కాదన్న యామినిపై లాయర్‌ చక్రవర్తి ఎలా పగ తీర్చుకున్నాడు? యామినితోపాటు వంశీ కూడా ఆ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? యామినికి అతడు న్యాయం చేశాడా? అసలు అజరును చంపిందెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగిలిన కథ.

2


గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో కోర్టు రూమ్‌ డ్రామా కథలు విరివిగా తెరకెక్కుతున్నాయి. ఒకే జోనర్‌లో ఎన్ని సినిమాలు / సిరీస్‌లొచ్చినా కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే 'వ్యవస్థ' టీమ్‌ ముందడుగేసింది. హీరోయిన్‌ తమ తొలిరాత్రే భర్తను ఎందుకు చంపాల్సి వచ్చింది? వారి మధ్య ఏం గొడవలున్నాయి? ఆమెకు శిక్ష పడుతుందా?.. ఇలా తొలి ఎపిసోడ్‌ ప్రారంభ సన్నివేశాలు ఉత్సుకత రేకెత్తిస్తాయి. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్‌ ఫస్ట్‌ సీన్‌తోనే రివీల్‌ చేసేశాడు. అయితే ముందుకు ఎలా వెళతాడన్న ఉత్సుకతను రేకెత్తించాడు. అయితే వంశీ, యామిని మధ్య ప్రేమను ఎలివేట్‌ చేసి, అసలు ఒకరికొకరు పరిచయం లేని వీరి మధ్య ప్రేమ ఏంటనే సందేహం కలిగించాడు. దానికి హీరో ఇచ్చే వివరణ కోణం కథగా రన్‌ అవుతుంది. ఇది కథనాన్ని నెమ్మదిగా లాగినట్లు అనిపిస్తుంది. మరోవైపు చక్రవర్తి పాత్రకు, వంశీకృష్ణ పాత్రకు ఉన్న అంతర్గత వైరాన్ని చక్కగా చూపించారు. తనకు మాత్రమే పేరు రావాలనే తలంపుతో చక్రవర్తి చేసే తప్పులను, వాటి వల్ల అతను పడే మానసిక సంఘర్షణను చక్కగా చూపించారు. మధ్యలో చెప్పాలనుకున్న పాయింట్‌ కంటే సైడ్‌ పాయింట్స్‌పై ఎక్కువ ఫోకస్‌ చేశారనిపిస్తుంది. సీజన్‌ 2 కోసం పాత్రల తీరు తెన్నులను ఇంత డెప్త్‌గా చూపించి ఉండొచ్చనే భావన కలుగుతుంది. న్యాయవ్యవస్థలో కొందరు లాయర్లు కేసులను, క్లైంట్స్‌ను ఎలా తప్పుదోవ పట్టిస్తారనే విషయాలను ఎలివేట్‌ చేసే ప్రయత్నం చేశారు. అవినాష్‌ భార్య గాయత్రి (కామ్నా జఠ్మలానీ) విదేశంలో ఉన్న తన కూతురికి ఫోన్‌ చేసి 'చెక్‌మేట్‌' బాధ్యతలు తీసుకునే సమయం వచ్చిందని చెప్పే క్లైమాక్స్‌ సీన్‌.. మరో సిరీస్‌ ఉంటుందేమో అనిపించేలా చేస్తుంది.

3


'కేరాఫ్‌ కంచరపాలెం', 'నారప్ప' తదితర హిట్‌ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌ రత్నం ఇందులోనూ సత్తా చాటాడు. జూనియర్‌ లాయర్‌ వంశీకృష్ణగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నెగెటివ్‌ రోల్స్‌తో మెప్పించిన సంపత్‌రాజ్‌ తనదైన శైలిలో నటించి, చక్రవర్తి పాత్రకు జీవం పోశారు. హెబ్బాపటేల్‌ కీలకపాత్ర పోషించినా అభినయానికి స్కోప్‌ లేదు. 'రణం', 'బెండు అప్పారావు' తదితర చిత్రాల్లో నటించిన కామ్నా జఠ్మలానీ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. తేజ కాకుమాను ఓ పాత్రలో కనిపించారు. మిగిలిన వారు పాత్రల పరిధి మేర నటించారు. ఇక ఈ సిరీస్‌కు నేపథ్య సంగీతం ప్రధాన బలం. ఛాయాగ్రహణం ఓకే. ఎడిటింగ్‌ విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తే బాగుండేది. 'ఓరు' సినిమాతో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ అందించిన దర్శకుడు ఆనంద్‌ రంగ ఈ సిరీస్‌కు పూర్తి న్యాయం చేయలేకపోయారు.

టైటిల్‌ : వ్యవస్థ
నటీనటులు : హెబ్బా పటేల్‌, కార్తీక్‌ రత్నం, సంపత్‌ రాజ్‌, కామ్నా జఠ్మలానీ, గురురాజ్‌, రామారావు జాదవ్‌ తదితరులు
కథ : రాజసింహ
మాటలు : రవి మల్లు
అడిషనల్‌ స్క్రీన్‌ ప్లే : శ్రవణ్‌
ఛాయాగ్రహణం : అనిల్‌ బండారి
సంగీతం : నరేష్‌ కుమరన్‌
దర్శకత్వం : ఆనంద్‌ రంగా
నిర్మాత : పట్టాభి ఆర్‌. చిలుకూరి
ఎపిసోడ్స్‌ : ఎనిమిది
ఓటీటీ : జీ 5