ప్రజాశక్తి- తిరుమల:తిరుమల శ్రీవారి హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుండి లెక్కించడం ప్రారంభించినట్లు టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేశామన్నారు. గతేడాది సెప్టెంబర్ 28న రాష్ట్ర సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇందులో సిసి కెమెరాలు, ఇతర మౌలిక వసతులు కల్పన పూర్తయినందున ఆదివారం ఉదయం నుంచి కానుకలను లెక్కించడం ప్రారంభించినట్లు తెలిపారు. తిరుమల పెద్ద జీయర్ స్వామివారి ఆశీస్సులతో ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి 12 హుండీలు చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో తరలించినట్లు చెప్పారు. ఇకపై ప్రతిరోజు అన్ని హుండీలూ నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు. నెలరోజుల తరువాత ఆలయంలోని పరకామణి మండపాన్ని సందర్శకులు కూర్చునేందుకు అనువుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. లెక్కింపును పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఇ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఇఒ పరకామణి ఇంచార్జ్ రాజేంద్రకుమార్, ఇఇలు శ్రీహరి, జగన్మోహన్ రెడ్డి, డిఇ రవిశంకర్ రెడ్డి, విజిఒ బాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.










