- బిజెపిని ఓడించడమే మా లక్ష్యం
- సిపిఐ పోటీ చేసే స్థానాల్లో మద్దతిస్తాం
- తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో:అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే విడిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చామనీ, దీన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరారు. 24 సీట్లకు పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయనీ, మొదటి విడతలో 17 స్థానాలను ప్రకటిస్తున్నామని వివరించారు. రెండు, మూడు రోజుల్లో మిగిలిన స్థానాలనూ, అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అవమానకరంగా పొత్తుల కోసం వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మిర్యాలగూడ, వైరా ఇస్తే కాంగ్రెస్‌తో పొత్తులో ఉంటామనీ, లేదంటే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ నాలుగు రోజుల కిందటే ప్రకటించామని చెప్పారు. కాంగ్రెస్ విజ్ఞప్తి మేరకు గురువారం మధ్యాహ్నం వరకు వారి నిర్ణయం కోసం ఎదురుచూశామని అన్నారు. వారు ఏమీ తేల్చని స్థితిలో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ అనుసరించిన అపసవ్యమైన విధానమే ఇందుకు కారణమన్నారు. అధికారంలోకి వచ్చాక వామపక్షాలకు చెరో ఎమ్మెల్సీ, మంత్రి పదవులిస్తామంటూ ఓ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారని అన్నారు. ప్రధాని పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర సిపిఎంకు ఉందన్నారు. కమ్యూనిస్టుల నిర్ణయాలకు ప్రాతిపదిక విధానాలే తప్ప పదవులు కాదన్నారు. తాము పోటీ చేయని నియోజకవర్గాల్లో బిజెపిని ఓడించగలిగేది బిఆర్‌ఎస్ అయితే బిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బిజెపిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌తో సిపిఐ తెగదెంపులు చేసుకుని వస్తే మంచిదన్నారు. ఒకవేళ వారికి కాంగ్రెస్‌తో పొత్తున్నా సిపిఐ పోటీ చేసే చోట తాము పోటీ చేయబోమనీ, సిపిఐకే మద్దతిస్తామని స్పష్టం చేశారు. తాము ప్రకటించిన 17 స్థానాల్లోనూ ఒకటి, రెండు మార్పులుండొచ్చని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ఓడించడం తమ లక్ష్యం కాదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మ్యానిఫెస్టో కమిటీ వేశామనీ, త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి తదితరులు పాల్గన్నారు.
పోటీ చేసే స్థానాలు
1. భద్రాచలం (ఎస్‌టి)
2. అశ్వరావు పేట (ఎస్‌టి)
3. పాలేరు
4. మధిర (ఎస్‌సి)
5. వైరా (ఎస్‌టి)
6. సత్తుపల్లి (ఎస్‌సి)
7. ఖమ్మం
8. మిర్యాలగూడ
9. నల్లగొండ
10. నకిరేకల్ (ఎస్‌సి)
11. భువనగిరి
12. హుజుర్‌నగర్
13. కోదాడ
14. జనగాం
15. ఇబ్రహీంపట్నం
16. పటాన్‌చెరు
17. ముషీరాబాద్










