Sep 10,2023 10:54

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఘోషిలో జరిగిన ఉప ఎన్నికలో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి ఘన విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి)కి సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు చేశారు. మతతత్వ సమీకరణలతో ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు బిజెపి చేస్తున్న కుట్రలపై సాధించిన గెలుపుగా ఆయన పేర్కొన్నారు. మైనార్టీలను, దళిత, గిరిజన ప్రజానీకాన్ని లక్ష్యంగా చేసుకొని 'బుల్డోజర్‌' రాజకీయాలు చేస్తూ మేధావులను, ప్రజాసంఘాల నేతలను వేధింపులకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రజలు సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు. ఇందుకు సంబంధించి 'బుల్డోజర్‌'ను లాక్కెళ్తున్న 'సైకిల్‌'తో కూడిన కార్టున్‌ను ఆయన తన పోస్టుకు జత చేశారు.
 

                                                  నియంత పాలనను తిరస్కరించిన ప్రజలు : సుప్రియా సూలే

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ సర్కారు నియంత పాలనను ప్రజలు తిరస్కరించారని నేషనలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (ఎన్‌సిపి) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, లోక్‌సభ సభ్యులు సుప్రియా సూలే అన్నారు. ఇటీవల ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలను 'ఇండియా' ఫోరం గెలుచుకోవడంపై ఆమె స్పందించారు. 'ఇండియా' ఫోరం అభ్యర్థులకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు దేశంలో ధరలు, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా ఓటేశారని, బిజెపి నియంతృత్వ పాలనను తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అదేవిధంగా మహారాష్ట్రలో కరువు పరిస్థితులు, మరాఠా రిజర్వేషన్‌లపై చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు.