- బిజెపిని ఓడించే శక్తి సిపిఎం ఒక్కటే : బివి రాఘవులు
- పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం నామినేషన్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో :అవకాశ వాద పార్టీలకు కాకుండా సిపిఎంకు వేసే ప్రతి ఓటు ఆయుధమని, మిగతా పార్టీలకు వేసే ఓటు బేరమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిపిఎంకు వేసే మొదటి ఓటు పోరాటానికి, రెండో ఓటు అవకాశవాద పార్టీలను కడిగిపారేసేందుకని చెప్పారు. వామపక్షాల అవసరమేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం, పాలేరు సిపిఎం అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన బహిరంగసభలో రాఘవులు ప్రసంగించారు. వామపక్షాలకు కాకుండా బూర్జువా పార్టీలకు ఓట్లేస్తామనడం సరికాదన్నారు. రాజకీయాలను ఉద్యమ రాజకీయాలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ శాసనసభలో కమ్యూనిస్టులు లేని లోపం కనిపిస్తుందని తెలిపారు. శాసనసభ ప్రజావేదికగా కాకుండా బూతుల వేదికగా మారిందని విమర్శించారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న ప్రతి ఒక్కర్నీ ఆహ్వానించేలా తమ పార్టీ విధానాన్ని రూపొందించుకున్నామన్నారు. కేరళలో కాంగ్రెస్, బెంగాల్‌లో తృణమూల్‌తో తగాదాలున్నా బిజెపిని ఓడించేందుకు సహకరిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే సమస్త హక్కుల కోసం పోరాడే వాణిగా ఉంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు. బహిరంగ సభ అనంతరం భారీ ప్రదర్శనగా వెళ్లి ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో తమ్మినేని నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఖమ్మం అభ్యర్థిగా యర్రా శ్రీకాంత్ నామినేషన్ వేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి అభ్యర్థులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, వై.విక్రమ్, బుగ్గవీటి సరళ తదితరులు పాల్గొన్నారు.










