- 'వెలిగొండ' ప్రారంభ గడువు అక్టోబర్
- ఆందోళనలో నిర్వాసితులు
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : వెలిగొండ ప్రాజెక్టును అక్టోబర్‌లోగా పూర్తి చేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఆయన గతంలో ప్రకటించిన గడువులు పెరుగుతూ వచ్చాయి. తాజాగా చేసిన ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తికి రెండు నెలల సమయం కూడా లేదు. సిఎం చెప్పినట్లుగా అక్టోబరులో ప్రారంభిస్తే నిర్వాసితులందరికీ పరిహారం, ప్యాకేజీలు, పునరావాసం ముందుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభిస్తామని గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏటా ప్రారంభ తేదీని మారుస్తూ నాలుగేళ్లకుపైగా గడిపేశారు. దీంతో, ఆయకట్టు రైతుల కలలు సాకారం కావడం లేదు. గతేడాది జిల్లాకు వచ్చిన సందర్భంగా చీమకుర్తిలో తాజా గడువును 20023 అక్టోబర్‌గా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తానన్నారు. ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రస్తుతం నిర్మాణపరమైన అవరోధాలు ఏమీ లేవు. మొదటి సొరంగం పనులు పూర్తయ్యాయి. రెండో సొరంగం పనులు జరుగుతున్నాయి. నీటిని వదిలేందుకు అవసరమైన పనులు నెల రోజుల్లో పూర్తి కానున్నాయని అధికారులు చెప్తున్నారు. 11 ముంపు గ్రామాల పరిధిలో 7,222 మంది నిర్వాసితులు ఉన్నారు. వీరిని తరలించే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వీరందరికీ గతంలోనే ఒన్‌టైం సెటిల్‌మెంటు కింద రూ.12.50 లక్షల చొప్పున ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఇస్తే నిర్వాసితులు అక్కడి నుంచి ఖాళీ చేస్తారని, ఆ తర్వాత ఎక్కడో ఒకచోట పునరావాసం కాలనీల్లో స్థలాలు ఇస్తే వారు ఇళ్లు కట్టుకుని ఉంటారనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. నిర్ణీత గడువుకు ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంది. దీనికి నిర్వాసితులు కూడా అంగీకరించారు. అక్కడ నుంచి బయటకు రావడానికి ఒప్పుకున్నారు. అయితే, ప్రభుత్వం ఇందుకు నిధులు కేటాయించలేదు.
రూ.1200 కోట్లకు పైగానే అవసరం
11 గ్రామాల నిర్వాసితులకు ఒన్‌టైం సెటిల్‌మెంటు కింద ప్యాకేజీల కోసం సుమారు రూ.1200 కోట్ల వరకూ నిధులు కావాలి. వీటి కోసం నిర్వాసితులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్యాకేజీ కోసం ఇప్పటివరకూ 4,500 మందిని ఖరారు చేసింది. కొన్ని పత్రాలు సమర్పించలేదనే పేరుతో మిగతా వారిని పక్కన పెట్టింది. జాబితాల్లో పేర్లు గల్లంతైన వారంతా మళ్లీ అర్జీలు పెట్టుకున్నారు. ఈ కాలంలో పిల్లలు పెద్దలు కావడంతో నిర్వాసితుల సంఖ్య పెరిగింది. వీళ్లకు ప్యాకేజీపై ప్రభుత్వం నోరుమెదపడం లేదు.
కేవలం రెండు గ్రామాలకే ప్యాకేజీలు ఇచ్చి...
నిధులు లేవనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారి ఆలోచనలు చేస్తోందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం 11 గ్రామాల నిర్వాసితులను ఖాళీ చేయించాలంటే భారీగా నిధులు కావాలి. నీళ్లు వదిలితే ముందుగా ముంపునకు గురయ్యే సుంకేశుల, అక్కచెరువు గ్రామాల నిర్వాసితులకు తొలుత ప్యాకేజీలు ఇచ్చి ఖాళీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు గ్రామాలే పెద్దవి. ఇక్కడే ఎక్కువ మంది నిర్వాసితులు ఉన్నారు. సుంకేశులలో 2,959 కుటుంబాలకు రూ.365 కోట్లు, అక్కచెరువులో 151 కుటుంబాలకు రూ.19.31 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. వీటితోపాటు ఇతర అవసరాల కోసం ఈ రెండు గ్రామాల వారికి మొత్తంగా రూ.500 కోట్లులోపు సరిపోతాయని చెప్తున్నారు.
నిర్వాసితుల్లో పెరుగుతున్న ఆందోళన
ఇప్పటికీ ప్యాకేజీలపై స్పష్టత లేదు. ఎవరికీ డబ్బులు రాలేదు. ప్రాజెక్టు ప్రారంభ గడువు దగ్గర పడుతుండడంతో నిర్వాసితుల్లో ఆందోళన పెరుగుతోంది. పైగా రెండు గ్రామాలకు ఇచ్చి మిగతా వారికి తర్వాత అనే ప్రచారం జరుగుతుండడంతో మా పరిస్థితి ఏమిటనే సందిగ్దంలో మిగతా గ్రామాల నిర్వాసితులు ఉన్నారు. అందరికీ న్యాయం జరిగేలా మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. నిర్వాసితులకు అన్ని రకాలుగా చెల్లింపులు పూర్తి చేశాకే ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమం పెట్టుకోవాలని నిర్వాసితుల పోరాట కమిటీ నాయకులు గాలి వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.










