ఒకరి మృతి, ఎనిమిది మందికి తీవ్రగాయాలు
అనేక ఇళ్లు దగ్ధం
ముంబయి : మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక గ్రామంలో మత ఘర్షణలు చెలరేగి ఒకరు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖతౌ తాలుకాలోని పుసేసావాలి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో ఒక అభ్యంతరకమైన పోస్టు పెట్టిన తరువాత ఈ ఘర్షణలు ప్రారంభమైనట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. సోషల్ మీడియాలో పోస్టు తరువాత గ్రామంలో అనేక ఇళ్లను దుండగులు తగులపెట్టారని, దీంతో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం, ఘర్షణలు ప్రారంభమయ్యాయని పోలీసులు చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు వెయ్యి మందితో ఉన్న ఒక దుండగుల గుంపు ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ఇళ్లు, వ్యాపార సంస్థలను తగులబెట్టారు. అడ్డువచ్చిన వారిపై భౌతిక హింసకు పాల్పడింది. ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకూ 25 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఇద్దర్ని అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు, మిగిలిన 23 మందిని హత్య, అల్లర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అరెస్టు చేశారు. అలాగే ముందుజాగ్రత్త చర్యగా జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం వరకూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సెక్షన్ 144 కూడా విధించినట్లు సతారా జిల్లా కలెక్టర్ జితేంద్ర దుడి తెలిపారు.










