Sep 23,2023 16:12

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : మున్సిపల్‌ కమీషనర్‌ ఎ.భార్గవ్‌ తేజ, ప్రముఖ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ''అలంకార్‌ ప్లాజా'', ''యుకాన్‌ ప్లాజా'', ''భూపాల్‌ కాంప్లెక్స్‌'' వద్ద శనివారం ఆకస్మిక పారిశుద్ధ్య తనిఖీలు చేపట్టారు. సాలిడ్‌ వేస్ట్‌ను సక్రమంగా పారవేయకపోవడం, నగర పరిశుభ్రతకు అడ్డంకిగా పరిణమించింది అని అన్నారు. ఈ కాంప్లెక్స్‌ల పరిధిలో ఉత్పత్తయ్యే ఘన వ్యర్థాలను, నిర్దేశించిన వ్యర్థాల-నిర్మూలన నిబంధనలను పక్కనపెట్టి, యథేచ్ఛగా పారాబోస్తున్నట్లు తెలుసుకన్నారు. దుకాణాల ట్రేడ్‌ లైసెన్సులు రుసుము కట్టి ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయించుకోకపోవడం.. కొన్ని దుకాణాలు అసలు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోనట్లు ఈ పర్యటనలో తెలింది. యథేచ్ఛగా చెత్త బయట వేసి,సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ నిబంధనలను పాటించనందుకు, మరియు ట్రేడ్‌ లైసెన్స్‌ రూల్స్‌ ఉల్లంఘించినందుకు, కమిషనర్‌ దుకాణాల యజమానులను హెచ్చరించి, షాప్‌లను తాత్కాలికంగా మూసి వేయించారు. వారందరికీ తగు జరిమానాలు విధించి, ఆ జరిమానాలను కట్టిన పిదప మాత్రమే తిరిగి షాపులను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ తో పాటు,ఎంహెచ్‌ఓ విశ్వేశ్వర్‌ రెడ్డి , శానిటేషన్‌ సూపర్వైజర్‌ నాగరాజు, శానిటేషన్‌ ఇన్స్పెక్టర్లు మునిస్వామి, షేక్షావలి, ముర్తుజావలి తదితరులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.