Jul 27,2023 21:50
  • రెండోటెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో గెలుపు

కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్‌ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 188పరుగులకు ఆలౌట్‌ కావడంతో పాకిస్తాన్‌ జట్టు ఇన్నింగ్స్‌ 222 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5వికెట్ల నష్టానికి 567పరుగుల వద్ద పాకిస్తాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయడంతో 411 పరుగులు వెనుకబడి శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. గురువారం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన శ్రీలంక 188 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నోమన్‌ అలీ(7/70) ఏడు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించగా.. నసీమ్‌ షా(3/44) నిప్పులు చెరిగే బౌలింగ్‌ చేశాడు. లంక బ్యాటర్లలో ఏంజేలో మాథ్యూస్‌(127బంతుల్లో 7ఫోర్లు, 2సిక్స్‌లతో 63నాటౌట్‌) అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అబ్దుల్లా షఫీక్‌కు, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అఘా సల్మాన్‌కు దక్కాయి. రెండో టెస్టుల్లోనూ పాక్‌ జట్టు ఇన్నింగ్స్‌ తేడాతో గెలుపొందడంతో డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో పాక్‌జట్టు అగ్రస్థానంలో నిలిచింది.