- పెరిగిన కూరగాయల ధరలతో కార్మికుల అవస్థలు
- బడ్జెట్ పెంచని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- 'జగనన్న గోరుముద్ద'కు అరకొర కుకింగ్ ఛార్జీలు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : మధ్యాహ్న భోజన పథకానికి పెరిగిన కూరగాయల ధరలు కాక పుట్టిస్తున్నాయి. విపరీతంగా వీటి ధరలు పెరగడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం వండి వడ్డించడానికి మిడ్డే మీల్స్ వర్కర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఏళ్ల క్రితం నిర్దేశించిన బడ్జెట్‌నే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అరకొర కుకుంగ్ ఛార్జీలతో వండి పెట్టాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మిడ్డే మీల్స్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం పేరును 2020 జనవరి 21 నుంచి రాష్ట్ర ప్రభుత్వం మార్పుచేసి 'జగనన్న గోరుముద్ద'గా అమలు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3,322 ప్రాథమిక పాఠశాలల్లో 1,78,434 మంది విద్యార్థులు, 347 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,24,874 మంది, 599 ఉన్నత పాఠశాలల్లో 86,696 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 4,268 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 3.90 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యనిస్తున్నారు. వీటిలో 28 మండలాల్లోని 808 పాఠశాలల్లో 1.35 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలు సరఫరా చేస్తున్నాయి. మిగిలిన పాఠశాలల్లో మొత్తం 8,116 మంది మిడ్డే మీల్స్ వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.5.88, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థికి రూ.8.57 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త మెనూ అమల్లోకి వచ్చింది. సోమవారం బిర్యాని, గుడ్డు కూర, మంగళవారం పులిహోర, గుడ్డు, టమోటా పచ్చడి లేదా దొండ పచ్చడి, బుధవారం బిర్యాని, బంగాళాదుంప కుర్మా, గుడ్డు, గురువారం సాంబారు బాత్ లేదా లెమన్ రైస్, గుడ్డు, పచ్చడి, శుక్రవారం పప్పు, ఆకుకూర, గుడ్డు, శనివారం గ్రీన్ రైస్, పప్పుచారు, చక్కెర పొంగలి ఇవ్వాలి. అయితే, మారిన మెనూ మేరకు ప్రభుత్వం కుకుంగ్ ఛార్జీలు పెంచలేదు.
ధరల మంట
మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం రైస్, గుడ్లు, చిక్కీలు, రాగి పిండి, బెల్లం మాత్రమే సరఫరా చేస్తోంది. కూరగాయలు, నూనె, కందిపప్పు, గ్యాస్ తదితర వాటిని ప్రభుత్వం ఇస్తున్న అతికొద్ది కుకింగ్ ఛార్జీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,170, వంట నూనె ధర లీటరు ప్యాకెట్ రూ.160, టమోటాలు కేజీ రూ.130, పచ్చిమిర్చి రూ.120, క్యారెట్ రూ.80, అల్లం రూ.220, వెల్లుల్లి రూ.120, ఎండుమిర్చి ధర రూ.260 ఉండడంతో మెనూ ప్రకారం వండి పెట్టడానికి మిడ్డే మీల్స్ వర్కర్లపై అదనపు భారం తప్పడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న అరకొర కుకింగ్ ఛార్జీలు ఏ మాత్రమూ సరిపోని పరిస్థితుల్లో వారు అప్పులు చేయాల్సి వస్తోంది.

విద్యార్థికి రూ.20 చొప్పున చెల్లించాలి
ఉదయం టిఫిన్ తినాలంటే రూ.30 నుంచి రూ.40 ఖర్చవుతోంది. అలాంటిది ఒక పూట భోజనానికి ప్రభుత్వం రూ.5.88 నుంచి రూ.8.57 మాత్రమే ఇస్తే ఎలా సరిపోతుంది. పెరిగిన గ్యాస్, నిత్యావసరాలు, కూరగాయల ధరల దృష్ట్యా ప్రతి విద్యార్థికీ రూ.20 చొప్పున కుకింగ్ ఛార్జీలు ఇవ్వాలి.
- నర్ల ఈశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి, మిడ్డే మీల్స్ వర్కర్స్ యూనియన్, కాకినాడ

కష్టంగా నిర్వహణ
ధరలు విపరీతంగా పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచడం లేదు. మాపై అదనపు భారం పడుతోంది. కొన్నేళ్ల క్రితం ఇచ్చిన వంట పాత్రలు పాడయ్యాయి. మా సొంత డబ్బులతోనే వంట పాత్రలు కొనుగోలు చేసుకున్నాం. అదనంగా రాగి జావ కూడా తయారు చేస్తున్నా వంట ఖర్చులకు అదనంగా ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదు.
- డి.సుబ్బలక్ష్మి, మిడ్డే మీల్స్ వర్కర్, జి.మామిడాడ పెదపూడి మండలం










