Sep 03,2023 11:05

గత కొంతకాలంగా మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. అందులోనూ అమ్మాయిల వస్త్రధారణ విషయంలో పెనుమార్పులు వచ్చాయనే చెప్పాలి. చదువుకున్నాక ఈ సమాజంలోని కట్టుబాట్లను ఆచరించడం అనేది తమని కట్టడి చేసేవని అర్థం చేసుకుంటున్నారు. ఫలితంగా మరింతగా కనిపిస్తోంది. ఈ మార్పు. ప్రధానంగా బొట్టు పెట్టుకోవడంలో, చున్నీలు తదితర విషయాల్లో ఒక రకంగా విప్లవాత్మకమైన మార్పే వచ్చిందనే చెప్పాలి. మనువాదం కలుపులా విస్తరించాలన్న కుట్ర చేస్తున్నా.. మరోవైపు అంతకన్నా ఎక్కువగానే కలుపు నివారణా చేస్తోంది నవతరం. ఒకరకంగా సామాజిక విప్లవం వస్తుందనే చెప్పాలి. ఆ మార్పు ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం పదండి..

        ఫ్యాషన్‌ ప్రపంచంలో విస్తృతంగా పెరుగుతున్న మార్పుల్లో వస్త్రధారణ ఒకటి. నుదుట బొట్టు పెట్టుకోకుండా ఉండడం మరొకటి. సాంప్రదాయం.. సంస్కృతి అంటూ కొందరు పెద్దలు చెప్తున్నా.. 'పాత చింతకాయ పచ్చడి!' అంటూ ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తున్నారు ఈ తరం. దీనిద్వారా సంస్కృతి కాపాడబడదు అని తేల్చిపారేస్తున్నారు కూడా. అందుకే వేషధారణలో, అలంకరణల్లో అనేక మార్పులు నేడు చోటుచేసుకున్నాయి. ట్రెండీగా కనిపించాలి అనే ఉద్దేశం కొందరిదైతే.. మనకు సెట్‌ అవుతుందా లేదా.. ఎవరేమన్నా అంటారేమో.. అనే విషయాలను పట్టించుకోవడమే మానేశారు మరికొందరు. తమకు నచ్చినవి ధరించడం ఒక్కటే నేటి యువత అసలైన ట్రెండ్‌. అసలు ఒకరికి నచ్చేలా ఉండాలనే ఆలోచనే పెద్ద ట్రాష్‌ అంటున్నారు నవతరం. మార్కెట్లో ఏ ఫ్యాషన్‌ కొత్తగా ఉంటే దాన్ని అందరూ ఫాలో అవ్వడం ఒకప్పుడు ఉండేది. ఇప్పటి తరం ఫ్యాషన్‌ని సెట్‌ చేస్తున్నారు. సాక్స్‌ దగ్గర నుంచి స్కార్ఫ్‌ వరకూ ఎలా ధరించాలో కూడా వీరే మోడలింగ్‌ చేసేస్తున్నారు.
 

                                                                                 లింగ వివక్ష..

ఏదైనా మార్పు అబ్బాయిలు చేస్తే అసలు పట్టించుకోరు. అదే అమ్మాయిలు ఏదైనా మార్పు తీసుకొస్తే వెయ్యినోళ్లు ఆక్షేపణకు రెడీగా ఉంటాయి. అయినా ఆ వేల నోళ్లు మూతపడేలా నేటి తరం ముందుకే సాగిపోతున్నారు. అబ్బాయిలు షార్ట్స్‌ వేసుకుని, చొక్కా వేసుకున్నారో లేదో కూడా తెలియకుండా ఉన్నా.. నోరెత్తరు. అదే అమ్మాయిల విషయంలో నైటీల దగ్గర నుంచి నైట్‌ డ్రెస్‌లు, టాప్స్‌ వరకూ అందరూ 'అందం, సంప్రదాయం' అంటూ సన్నాయి నొక్కులు నొక్కేస్తారు. అబ్బాయిల విషయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం.. ఆడపిల్లల వస్త్రధారణపై ఎక్కువగా విమర్శలు చేయడం.. ఇవన్నీ పురుషాధిక్య భావజాలం ప్రభావంతోనే అన్నది అక్షర సత్యాలు. అంతేకాదు అబ్బాయిల ప్రవర్తనను పట్టించుకోరు.. వారు వేసుకునే డ్రెస్‌ కోడ్‌ను అసలే పట్టించుకోరు. అదే అమ్మాయి వేసుకునే వస్త్రాలను బట్టి ఆమె క్యారెక్టర్ని జడ్జ్‌ చేసే జనం మన చుట్టూనే ఉన్నారు.
 

                                                                            సౌకర్యం.. సౌలభ్యం..

ఆదిమ సమాజంలో ఆకులు చుట్టుకునే వారని ఇప్పుడూ అవే కట్టుకోవడం లేదు కదా.. నాగరికతతో పాటు, సౌకర్యం, సౌలభ్యం ముఖ్యం. అలాగే ఒకప్పుడు మహిళలు చీర కట్టుకునేవారు.. ఆ తరువాత కంఫర్ట్‌ కోసం పంజాబీ డ్రెస్సులు అలవాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరీ కంఫర్టబుల్‌గా టాప్‌, లెగ్గిన్స్‌, జీన్స్‌తో ధరిస్తున్నారు. అయితే చాలామంది అమ్మాయిలు డ్రెస్సులపై చున్నీలు వేసుకోవడానికి ఇష్టపడడం లేదు. వాతావరణాన్ని బట్టి కొందరు కోట్‌ వంటి వస్త్రాలను ధరిస్తున్నారు. అమ్మాయిల వస్త్రధారణలో మాయమైన ఈ చున్నీ గురించి ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. అయితే రీసెంట్‌గా ఈ ప్రశ్నకు లలిత అనే కోరా యూజర్‌ అందరికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే సమాధానం ఇచ్చారు. 'నాకు కంఫర్ట్‌గా లేదు కాబట్టి నేను వేసుకోను.. పదహారేళ్ళ వయసులో చున్నీ వేసుకొని మా అమ్మతో కలిసి నడుస్తున్నప్పుడు కూడా చూసేవాళ్ళ చూపులు ఆగలేదు కదా.. 21 సంవత్సరాల వయసులో సాక్షాత్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తలనీలాలు ఇస్తున్న ఎందరో అవే నికృష్ట చూపులతో నావైపు చూశారు. కానీ ఇప్పుడు నేను వేసుకున్నా, వేసుకోకపోయినా నా దగ్గర వెధవ వేషాలు వేయడానికి ఎవరు సాహసించరు. అప్పుడు లేనిదీ ఇప్పుడు నా దగ్గర ఉన్నదీ నా ధైర్యం..' అని ఆమె అన్నారు.
            అంటే అమ్మాయిలకు కావాల్సింది దుప్పట్టా కాదు..బొట్టు కాదు.. సంప్రదాయం అంతకన్నా కాదు.. ధైర్యం అనే రక్షణ కవచం. అలాగే ఆచారాలు, వస్త్రధారణ, పద్ధతులు.. అంటూ అమ్మాయిలకు ఆంక్షలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యం వారికి కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆత్మరక్షణ చేసుకునేలా కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ అమ్మాయిలకి నేర్పించాలి.