- మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దు : ప్రభుత్వం
- వైద్య నివేదికలు సమర్పించండి
- జైలు అధికారులకు హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను దసరా సెలవుల్లో కేసుల విచారణ చేసే ప్రత్యేక బెంచ్ విచారణ చేస్తుందని హైకోర్టు ప్రకటించింది. వెకేషన్ బెంచ్ ఎదుట విచారణకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కె సురేష్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్ కేసులో ఎసిబి కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు 40 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి న్యాయవాది వివరించారు. కనీసం రెండు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని ప్రభుత్వం తరఫున అదనపు ఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఉందని, తీర్పు వాయిదా పడిందని, ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు.. తదుపరి విచారణ నాటికి చంద్రబాబు వైద్య నివేదికలను అందజేయాలని జైలు అధికారులను ఆదేశించింది.
ప్రొటోకాల్ పాటించండి
ఈ నెల 20న జరిగే ద్రవిడియన్ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్ విషయంలో ప్రొటోకాల్ పాటించాలని ఆ వర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశించింది. గత ఆహ్వాన పత్రికను సవరించాలని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఆదేశాలిచ్చారు. 26వ ఫౌండేషన్ డేకు ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్సీ వేసిన పిటిషన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది.
రుషికొండ వివాదంపై త్వరగా తేల్చండి
రుషికొండను అక్రమంగా తవ్వేసి భవనాల నిర్మాణం చేశారనే పిల్‌పై సత్వరమే తీర్పు చెప్పాలని హైకోర్టును ఎంపి రఘురామ కృష్ణరాజు తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టును కోరారు. రుషికొండలో కట్టిన భవనాల్లోకి ఆఫీసుల తరలింపునకు జిఓలు వెలువడ్డాయని, ఈ నేపథ్యంలో తీర్పును సత్వరమే వెలువరించాలని కోరారు. ఈ అభ్యర్థనను పరిశీలిస్తామని సిజె బెంచ్ ప్రకటించింది.
మార్గదర్శి ఖాతాల స్తంభన నోటీసుల సస్పెన్షన్
మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ చీరాల, విశాఖ, విశాఖలోని సీతంపేట బ్రాంచుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. పోలీసులు వేర్వేరుగా తీసుకున్న నిర్ణయాలను అమలును నిలిపివేస్తూ జస్టిస్ సుబ్బారెడ్డి మధ్యంతర ఆదేశాలిచ్చారు. బ్యాంకు ఖాతాలను తిరిగి నిర్వహించుకునేలా ఆయా బ్యాంక్ మేనేజర్లకు అనుమతినిచ్చారు. పోలీసుల చర్యల కారణంగా మార్గదర్శి కంపెనీ కంటే అందులోని చందాదారులకు నష్టం చేకూరుతుందన్నారు. ఆ బ్రాంచ్ మేనేజర్లు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో పోలీసులు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత విచారణ చేస్తామన్నారు.










