- రాతపూర్వకంగా సమర్పించాలన్న జడ్జి
- వచ్చే నెల 1 వరకు రిమాండ్
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి:స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు కల్పిస్తున్న భద్రత పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు కొన్ని అనుమానాలున్నాయని న్యాయమూర్తికి తెలియజేశారు. చంద్రబాబు 40 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. గురువారంతో రిమాండ్ గడువు ముగియడంతో ఆయన్ని జైలు అధికారులు ఎసిబి న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఎసిబి న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. తన భద్రత విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు. ఆ విషయాలను రాతపూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబుకు న్యాయమూర్తి సూచించారు. ఆయన రాసే లేఖను తనకు పంపించాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులను కూడా ప్రశ్నించారు. మెడికల్ రిపోర్టులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని ఆదేశించారు. అనంతరం రిమాండ్‌ను వచ్చే నెల నవంబరు 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.కాగా లీగల్ ములాఖత్‌ను పెంచాలని, రోజుకు మూడు ములాఖత్‌లు ఇవ్వాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఎసిబి కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.










