చేరుకున్న మొబైల్ ఎంబిఎస్‌ఎల్- 3 ల్యాబ్
నిఫాపై కేరళకు సహకరించనున్న నిపుణులు
న్యూఢిల్లీ : నిఫా వైరస్‌కు సంబంధించిన నమూనాలను పరీక్షించడం కోసం కేరళలోని కోజికోడ్‌కు తన మొబైల్ బిఎస్‌ఎల్- 3 ల్యాబరేటరీని పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) తరలించింది. జంతువుల నుంచి నమూనాలను సేకరించి, పరీక్షలు చేయడంలో సహాయం చేయడానికి పశుసంవర్థక రంగ నిపుణులను కూడా పంపించింది. కోజికోడ్‌లో రెండు నిఫా మరణాలతోపాటు ఇప్పటి వరకూ ఐదు నిఫా కేసులు వెలుగు చూశాయి. 'దక్షిణాసియాలోని మొట్టమొదటి బయో సేఫ్టీ లెవల్-3 కంటైన్‌మెంట్ మొబైల్ ల్యాబరేటరీ అయిన ఐసిఎంఆర్ ఎంబిఎస్‌ఎల్-3 కోజికోడ్‌కు చేరుకుంది. ఇది జిల్లాలో నిఫా పరీక్షలకు, ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడానికి సహాయపడుతుంది' అని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ అనుమానిత నిఫా వైరస్ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారు. తీవ్రమైన అంటువ్యాధులను, ప్రాణాంతకమైన వైరల్ ఇన్‌ఫెక్షన్‌లను పరిశీలించడానికి గత ఏడాది ఫిబ్రవరిలో ఈ మొబైల్ ల్యాబరేటరీని ఏర్పాటు చేశారు. కేరళలో నిఫా కేసులు వెలుగుచూడటంతో పరిస్థితిని సమీక్షించడానికి పూణేలోని ఎన్‌ఐవిలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సందర్శించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కోజికోడ్ జిల్లా నిఫా వ్యాప్తి గురించి భయపడాల్సిన అవసరం లేదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాల కోసం బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిఫా వైరస్ సోకిన వారి చికిత్సకు అవసరమైన మోనోక్లోనల్ యాంటీబాడీ రాష్ట్రానికి చేరుకుందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. నిఫా హెచ్చరికలో భాగంగా కోజికోడ్ జిల్లాలోని విద్యాసంస్థలకు శుక్ర, శనివారాల్లో కలెక్టర్ సెలవు ప్రకటించారు. ప్రొఫెషనల్ కాలేజీలతో సహా అన్ని విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుంది.










