Oct 24,2023 12:52

భూపాలపల్లి : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ కుంగిన నేపథ్యంలో... మంగళవారం అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. కేంద్ర జల సంఘం సభ్యుడు అనిల్‌ జైన్‌ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ ప్రాజెక్ట్‌ను పరిశీలించి.. రాష్ట్ర అధికారులతో భేటీ కానుంది. 20వ పిల్లర్‌ వద్ద పగుళ్లకు గల కారణాలతో పాటు బ్యారేజ్‌ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేయనుంది. సమగ్ర పరిశీలన తర్వాత కేంద్ర జలశక్తి శాఖకు నివేదించనుంది. కేంద్ర బఅందంతోపాటు కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ఉన్నారు.

                                                  కుంగిపోయిన 20వ పియర్‌... నీరు దిగువకు విడుదల...

మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిన నేపథ్యంలో నీటిని విడుదల చేశారు. బ్యారేజ్‌ ఎగువ నుంచి 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల వరదను దిగువకు విడిచిపెట్టారు. ఈ నెల 21న రాత్రి భారీ శబ్దంతో బ్యారేజ్‌ 20వ పియర్‌ కుంగిపోయింది. దీంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. డ్యాంకు.. క్రస్టు గేటుకు మధ్య పగుళ్లు వచ్చాయి. గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీకి ఒకవైపు మహారాష్ట్ర, రెండోవైపు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.