స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం కుట్రలను ప్రతిఘటించాలి : సిపిఎం - కొనసాగిన ఉక్కు రక్షణ బైక్ యాత్ర
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి :విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం పన్నుతోన్న కుట్రలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఎం చేపట్టిన ఉక్కు రక్షణ బైక్ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. రెండో రోజు శుక్రవారం శ్రీకాకుళం నగరం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట ప్రాంతాల్లో సాగింది. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన ఉక్కు పరిశ్రమను మోడీ సర్కార్ ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందని తెలిపారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో బిజెపి దుర్మార్గంగా వ్యవహరిస్తోన్నా రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీ నోరెత్తకపోవడం సరికాదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒకరినొకరు దూషించుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై మాట్లాడటానికి తీరిక లేకుండా పోయిందని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నా రాష్ట్ర ఎంపిలు పార్లమెంట్‌లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. నరసన్నపేటలో నిర్వహించిన సభలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజశర్మ మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగాలు, సామాజిక న్యాయం దక్కాలంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పోరాటాలు చేయాలని కోరారు. బైక్ యాత్రలో భాగంగా తొలుత శ్రీకాకుళంలో అంబేద్కర్ విగ్రహానికి, డే అండ్ నైట్ కూడలిలో సర్దార్ గౌత్ లచ్చన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టెక్కలిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైక్ యాత్రకు స్వాగతం పలికారు. బైక్ యాత్ర సాగిన ప్రాంతాల్లో ప్రజా, కార్మిక, రైతు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గని సంఘీభావం తెలిపారు. యాత్రలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.










