Sep 20,2023 15:48

ఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ బిల్లును బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయదని, కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నితీష్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ''వాళ్లకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేసే ఉద్దేశం లేదు. వాళ్లకు ఆ ఉద్దేశం అంటూ ఉంటే గతంలోనే ఆ పని చేసేవారు'' అని బుధవారంనాడు మీడియాతో మాట్లాడూతూ నితీష్‌ అన్నారు. మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడం తప్పనిసరి అని, మొదట్నించీ తాము దీని కోసం డిమాండ్‌ చేస్తూనే ఉన్నామని, అయినా వాళ్లు (కేంద్రం) ఈ బిల్లును అమలు చేయలేదని నితీష్‌ అన్నారు. కుల ఆధారణ జనగణన చేపట్టాలని తాము చాలాకాలంగా కోరుతూనే ఉన్నామని, ఇప్పటికీ ఇది తమ డిమాండ్‌గా ఉందని తెలిపారు.