ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నష్టాలకు కేంద్రమే బాధ్యత వహించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ డి.ఆదినారాయణ, కో - కన్వీనర్ జె.అయోధ్యరామ్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1001వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్ ఎంఎంఎస్, ఎం అండ్ ఎస్‌టిఎం విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించకపోవడం వల్లే ఉత్పత్తి కుంటుపడి నష్టాల్లోకి వెళ్తోందన్నారు. సకాలంలో రా మెటీరియల్ సరఫరా జరగకపోవడం వల్లనూ నష్టాలు పెరుగుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పటికైనా విశాఖ ఉక్కుపై కుట్రలను ఆపి ఉత్పత్తి సజావుగా సాగేలా చూడాలన్నారు. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు జె.రామకృష్ణ, ఉద్యోగులు డి.దేముడు, జి.ఆనంద్, ఎంకెవి.రాజేశ్వరరావు, డి.రమేష్, వర్మ పాల్గొన్నారు.










