Nov 07,2023 16:03

మందమర్రి: సింగరేణిని ప్రైవేటీకరించాలని కేంద్రం యత్నిస్తోందని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో నిర్వహించిన బిఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ''కేంద్రం వద్ద అప్పులు తెచ్చి.. సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్‌యే. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది ఆ పార్టీయే. తెలంగాణ రాక ముందు వరకు భయంకర పరిస్థితులు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిని లాభాల బాటలోకి తెచ్చాం. ప్రస్తుతం సింగరేణిలో రూ.2,184 కోట్ల లాభాలు వచ్చాయి. దసరా, దీపావళి బోనస్‌ రూ.వెయ్యి కోట్లు పంచుతున్నాం. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు లాభాలలో వాటా 18శాతం మాత్రమే ఇచ్చారు.. కానీ, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 32 శాతం ఇస్తోంది. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్‌ ఎప్పుడైనా రైతుల గురించి ఆలోచించిందా? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి .. రైతు బంధు పథకం వఅథా అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడేమో వ్యవసాయానికి 3గంటల విద్యుత్‌ చాలంటున్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా రైతు భూమిపై రైతుకే అధికారం ఇచ్చాం. కాంగ్రెస్‌ నేతలు.. ధరణి పోర్టల్‌ను తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. ధరణి కావాలో? వద్దో? రైతులే నిర్ణయించుకోవాలి. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా పరిణతి రావాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి'' అని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.