Nov 07,2023 08:21

-న్యూస్‌క్లిక్‌ కేసులో కిసాన్‌మోర్చాను చేర్చడం దారుణం
- రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్‌ కాపీలు దగ్ధం
ప్రజాశక్తి- యంత్రాంగం:విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని, న్యూస్‌క్లిక్‌ మీడియా సంస్థపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఎఫ్‌ఐఆర్‌లో సంయుక్త కిసాన్‌మోర్చా పేరును చేర్చడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. న్యూస్‌క్లిక్‌పై పెట్టిన కేసు ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దగ్ధం చేశారు. భావప్రకటనా స్వేచ్ఛను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.
గుంటూరులోని శంకర్‌విలాస్‌ సెంటర్‌, పల్నాడు జిల్లా నరసరావుపేట ధర్నా చౌక్‌లో ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దగ్ధం చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి న్యూస్‌క్లిక్‌ అండగా నిలిచిందనే అక్కసుతో యాజమాన్యంపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేయబడ్డ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్త, అమిత్‌ చక్రవర్తిని బేషరతుగా విడుదల చేయకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నెల్లూరులోని విఆర్‌సి సెంటర్‌లో చేపట్టిన నిరసననుద్దేశించి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. న్యూస్‌క్లిక్‌పై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. మీడియా సంస్థపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని తెలిపారు. రైతాంగ పోరాటానికి అండగా నిలిచినందు వల్లే న్యూస్‌క్లిక్‌ నిర్వాహకులపై ఉపా చట్టాన్ని ప్రయోగించి జైలులో పెట్టిందన్నారు. తిరుపతి బైరాగిపట్టెడలో నిరసన తెలిపారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు నాగసుబ్బారెడ్డి, ఎఐకెఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్‌ మాట్లాడారు. న్యూస్‌క్లిక్‌ యాజమాన్యంపై పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేయాలని, భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్‌ చేశారు.
అనంతపురం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని నాలుగురోడ్ల జంక్షన్‌ అంబేద్కర్‌ స్తూపం వద్ద నిరసన చేపట్టి ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దగ్ధం చేశారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన, నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఆర్‌టిసి బస్టాండ్‌ ఎదుట ధర్నా చేపట్టారు. శ్రీకాకుళంలోని స్థానిక అంబేద్కర్‌ కూడలి వద్ద ఆందోళన నిర్వహించారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద, కడప పాత బస్టాండ్‌ జ్యోతిరావు పూలే సర్కిల్‌, కృష్ణాజిల్లాలో గుడ్లవల్లేరు, గన్నవరం, ఎన్‌టిఆర్‌ జిల్లాలోని మైలవరం, ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం, చింతలపూడిబోసుబమ్మ సెంటర్‌, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు, గణపవరం మండలం పిప్పర వంతెన వద్ద, తాడేపల్లిగూడెంలో సుందరయ్య భవనం ఎదురుగా, ఉండి మండలం యండగండిలో ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను దగ్ధం చేశారు.