Oct 03,2023 17:24

ప్రజాశక్తి-కర్నూలుకార్పొరేషన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్‌ 21ని రద్దు చేయాలని, ఈ చలానా విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో ఈనెల 6న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌ రాధాకృష్ణ, ఏపీ ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్‌ యూనియన్‌ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌ ఆటో కార్మికులకు తెలియజేశారు. కార్మిక కర్షక భవన్లో మంగళవారం జిల్లా అందుబాటులో ఆటో యూనియన్‌ నాయకుల సమావేశం ఆటో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి. రాధాకష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి.ఎస్‌. రాధాకష్ణ. మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ కలిగిన ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఒకపక్క ఇస్తూనే ,మరోపక్క ఈ చలానా, అధిక పెనాల్టీలు, జరిమానాల పేరుతో వేలాది రూపాయలు డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్నదని వీటి వల్ల ప్రతి డ్రైవరు సంవత్సరానికి ఐదు నుంచి పదివేల రూపాయలు చెల్లించవలసి వస్తుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్‌ ఆక్ట్‌ సవరణ బిల్లులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 21 ద్వారా అధిక పెనాల్టీలు, జరిమానాలు భారీగా పెంచిందని వారన్నారు. తక్షణమే జీవో నెంబర్‌ 21 రద్దు చేయాలని, ఈ చలానా విధానాన్ని రద్దు చేయాలని. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తదితరు డిమాండ్లతో ఈనెల ఆరవ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. నగరంలో, వివిధ మండలాల్లో విస్తతంగా కరపత్రాలు ద్వారా చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రచారం నిర్వహిస్తున్నామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహమూద్‌ న్యూ సిటీ నగర ఉపాధ్యక్షులు ఎస్‌. మాలిక్‌ భాష, ఓల్డ్‌ సిటీ నగర ఉపాధ్యక్షులు కుమార్‌ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.