బెంగళూరు (కర్నాటక) : ఆందోళనలతో కర్నాటక అట్టుడికిపోతోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్ నేపథ్యంలో ... రాష్ట్రమంతా స్తంభించింది. అన్ని రంగాలు, రవాణాలు, ప్రయాణాలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి. పలు చోట్ల ఆందోళనకారులు నిరసనకు దిగగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ విధించారు.
బంద్‌కు పిలుపునిచ్చిన పలు సంఘాలు...
కర్నాటక ప్రభుత్వం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ... కన్నడ, రైతు సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. గత మంగళవారం బెంగళూరులో ఉధృతంగా బంద్ కొనసాగింది. మళ్లీ రోజుల వ్యవధిలోనే ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. కర్నాటక రక్షణ వేదిక, జయ కర్ణాటక సంఘం, ఇతర కన్నడ సంఘాలు, రైతు సంఘం, హసిరుసేన, చెరకు సాగుదారుల సంఘం, ట్యాక్సీ- ఆటోరిక్షా సంఘాలు, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, సినిమా కళాకారుల సంఘం తదితర వందకు పైగా సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం ఆరు గంటల నుంచే బంద్ మొదలైంది.
ఈరోజు ఉదయం 6 గంటల నుండే బంద్ కొనసాగుతోంది. మైసూరులో బస్టాంట్ ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిక్కమంగళూరులో కొందరు ఆందోళనకారులు పెట్రోల్‌బంక్‌లోకి దూసుకొచ్చి బలవంతంగా మూసివేయించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 50 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు కన్నడ సంఘాలకు వ్యతిరేకంగా తమిళనాడులోనూ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
44 విమాన సర్వీసులు రద్దు..
కర్నాటకలోని రాష్ట్రవ్యాప్త బంద్ తీవ్రరూపం దాల్చడంతో ... ఎక్కడికక్కడ రవాణా సేవలు నిలిచిపోయాయి. విద్యా సంస్థలు మూతబడ్డాయి. బంద్‌కు మద్దతుగా హౌటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు కూడా పనిచేయడంలేదు. మరోవైపు... బంద్ ప్రభావం విమాన రాకపోకలపైనా పడింది. బెంగళూరు విమానాశ్రయంలో ఈ ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బంద్ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడంతో ఈ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
అధికారుల భద్రతా చర్యలు...
రాష్ట్ర బంద్ నేపథ్యంలో ... తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత తమిళనాడుకు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులను ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం అర్ధరాత్రి వరకు నిలిపివేశారు.
రాష్ట్రంలో 144 సెక్షన్...
బంద్ నేపథ్యంలో ... శుక్రవారం అర్ధరాత్రి వరకు కర్నాటక రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 144 సెక్షన్ విధించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు చోట్ల సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, కేఆర్‌ఎస్ ఆనకట్ట, పర్యాటక, చారిత్రక కట్టడాల వద్ద ప్రభుత్వం భద్రతను పెంచింది.
బెంగళూరు బంద్‌తో రూ.1500కోట్ల నష్టం.. మళ్లీ భారీ నష్టం..!
కావేరీ జలాల విడుదలపై గత మంగళవారం బెంగళూరులో బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ బంద్ కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.1000-1500 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రోజుల వ్యవధిలోనే మరోసారి బంద్ చేపట్టడం.. భారీ నష్టానికి దారితీస్తుందని పరిశ్రమలు, ఉద్యోగుల సంఘాలు వెల్లడించాయి.










