మైసూర్ : సమాజంలో అసమానతలు తొలగించేందుకు కులగణన అవసరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కులగణన సమాజాన్ని విభజిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు. 76 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో వివిధ కులాల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. శనివారం మైసూర్‌లోని విమానాశ్రయం వద్ద విలేకరులతో సిద్ధరామయ్య మాట్లాడారు. అందర్నీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిలో వివిధ కులాల స్థితిగతులపై సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుల గణన సమాజాన్ని విభజించదని ఆయన స్పష్టం చేశారు. బిజెపి చేసే పనులకు, చేసే ప్రకటనలకు పొంతన ఉండదని విమర్శించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన కులగణన నివేదికను ఆమోదించడానికి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి నిరాకరించారని సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుతం ఉన్న బిసి కమిషన్ చైర్మన్‌ను నివేదిక సమర్పించాలని చెప్పానని, ఈ ఏడాది నవంబర్‌లో నివేదికను సమర్పిస్తారని సిద్ధరామయ్య తెలిపారు. ఈ కుల గణన నివేదిక వచ్చిన తరువాతే అత్యంత వెనుకబడిన బిసి కులాలకు ప్రత్యేక కేటగిరీ సృష్టించాలనే డిమాండ్‌పై పరిశీలన చేస్తామని తెలిపారు.










