బిలాస్‌పూర్ : తాము అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన జన గణన నిర్వహిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో పర్సాదా (సక్రి) గ్రామలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'అవాస్ న్యాయ సమ్మేళన్'లో ఆయన ప్రనంగించారు. నిరాశ్రయులకు, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు వున్న కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఈ పథకం చేపట్టారు. జనాన్ని ఉద్దేశించి రాహుల్, రిమోట్ కంట్రోల్‌ను ఊపుతూ కాంగ్రెస్ దీన్ని గనక నొక్కితే నిరుపేదలు, అవసరంలో వున్నవారు లాభపడతారని అన్నారు. ఈ రోజున దీన్ని నొక్కగానే రూ.వేల కోట్ల రూపాయిలు ఛత్తీస్‌గఢ్ ప్రజల ఖాతాల్లోకి చేరాయన్నారు. అదే పాలక బిజెపి చేస్తే అదానీకి ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే కాంట్రాక్టులు వస్తాయన్నారు. కాంగ్రెస్ ఈ రిమోట్ కంట్రోల్‌ను బహిరంగంగా నొక్కితే, బిజెపి రహస్యంగా చేస్తుందని విమర్శించారు. కులగణన చేపడితేనే దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు), మహిళల ప్రాతినిధ్యం సాధ్యపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో వున్నపుడు నిర్వహించిన కుల గణన వివరాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. దీని పట్ల ప్రధాని మోడీకి భయం వుందేమో తాను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఒబిసిలు, దళితులు, గిరిజనులు, మహిళలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే కుల గణన తప్పక నిర్వహించాల్సి వుంటుందన్నారు.










