బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం) : భద్రాద్రి కొత్తగూడెంలో శనివారం ఉదయం కారు బీభత్సాన్ని సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కారులో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర్ వద్ద నిందితులను పట్టుకునేందుకు మాటువేశారు. కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ స్మగ్లర్లు కారును ఆపకుండా అతివేగంతో పాల్వంచ వైపుకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో మోరంపల్లిబంజర్ గ్రామంలో ఆ కారును ఆపేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు మాటు వేశారు. దీంతో ఆ కారును స్మగ్లర్లు మరింత వేగంతో నడిపి ఓ బైక్‌ను మరో ఆటోను ఢకొీట్టారు. బైక్ పై వెళుతున్న వ్యక్తికి తీవ్రగాయాలవ్వగా వెంటనే ఆ వ్యక్తిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న మరో స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఉన్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసి భద్రాచలం ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.










