- ఖలిస్థానీ నేత హత్య నేపథ్యంలో ఉద్రిక్తత
- రాయబారులపై పరస్పర బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ : భారత్-కెనడా దేశాల మధ్య తీవ్రస్థాయిలో దౌత్య సంక్షోభం నెలకొంది. కెనడాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్థానీ ప్రముఖ నాయకడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ దారుణం వెనుక భారత ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపిస్తూ కెనడా ప్రభుత్వం తొలుత చర్యలకు దిగింది. భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. అయితే కెనడా వాదనలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. కెనడా చర్యకు ప్రతి చర్యగా ఆ దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తను కేంద్రం బహిష్కరించింది. ఐదు రోజుల్లోగా భారత్ విడిచివెళ్లాల్సిందిగా మంగళవారం ఆదేశించింది. జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిజ్జర్ హత్య గురించి సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఒక ప్రకటన చేశారు. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని తెలిపారు. ఇటువంటి చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే, కెనడాలో ఉన్న భారత దౌత్యకార్యాలయంలోని రీసెర్చి అండ్ ఎనాలసిస్ వింగ్ అధికారి పవన్ కుమార్ రారును దేశాన్ని వీడి వెళ్లాల్సిందిగా బహిష్కరించినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలి పార్లమెంట్‌కు తెలిపారు. ట్రూడో ప్రభుత్వం ఆరోపణలను కొట్టిపారేసిన భారత్ కూడా తీవ్రస్థాయిలో ప్రతి స్పందన తెలియజేసింది. భారత్‌లోని కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్‌కేకు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం సమన్లు జారీ చేసింది. దీంతో ఉదయం న్యూఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో గల విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయానికి మెక్‌కే చేరుకున్నారు. మెక్‌కేకు భారత్‌లోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విదేశాంగ తెలిపింది. ఐదు రోజుల్లోగా ఆ దౌత్యవేత్త దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.










