ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా కేసుకు సంబంధించి విధుల్లో వున్న సిఐడి అధికారుల కాల్‌డేటా ఇవ్వలేమని సిఐడి ఎసిబి కోర్టుకు తెలిపింది.
అరెస్ట్ సందర్భంగా విధుల్లో ఉన్న అధికారుల కాల్‌డేటా కావాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషనపై గురువారం ఎసిబి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అఫిడవిట్ దాకలు చేసిన సిఐడి అధికారులు అలా ఇవ్వడం గోప్యతకు భంగం కలిగించినట్టు అవుతుందని పేర్కొన్నారు. సెప్టెంబరు 8న అర్ధరాత్రి దాటాక చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేశారని ఆ నేపథ్యంలో వెనుకా, ముందు వేళల్లో అధికారుల కాల్‌డేటా ఇవ్వాలని చంద్రబాబు న్యాయవాదులు కోరారు. అరెస్టు సమయంలో సిఐడి అధికారులు బయటి వ్యక్తుల్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని వాదించారు. దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తుంటారని, అలాంటి డేటాను ఇవ్వడం అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సిఐడి తరపు న్యాయవాది కౌంటర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సిఐడి అధికారుల భద్రతకు సమస్యలు వస్తాయని సిఐడి తెలిపింది. వాదనల అనంతరం తదుపరి విచారణను ఎసిబి కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ
మధ్యంతర బెయిల్ కోసం అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు మిగతా 2లో హైకోర్టు నిరాకరించింది.తనకు మూడు నెలల క్రితం ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు కుడి కంటికి కూడా కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి వుందని పేర్కొంటూ చంద్రబాబు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు . ఈ పిటిషన్ పై విచారణకు హైకోర్టు నిరాకరించింది.
బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
స్కిల్ డెవలప్‌మెంటు కేసులో గతంలో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం అనుబంధ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు వెకేషన్ కోర్టు విచారణ చేయనుంది.










